2014లో వచ్చిన అఖండ మెజార్టీ బీజేపీకి 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో రాదని రిపబ్లిక్ టీవీ సర్వేతో పాటు ఏబీపీ సీ ఓటర్ సర్వేలు చాటి చెబుతున్నాయి. ఈ సారి కమలనాథుల కంచుకోటలు కరిగిపోవడం ఖాయమని అంచనా వేస్తున్నాయి. ఏబీపీ, సీ ఓటర్ సర్వేతో పాటు బీజేపీ అనుకూల చానెల్ రిపబ్లిక్ టీవీ కూడా అదే చెబుతుండటంతో బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఏబీపీ, సీ ఓటర్ సర్వే చెప్పింది. రాజస్థాన్ లో ఉచిత విద్యుత్ వంటి పథకాలు వసుంధర రాజే ప్రభుత్వం ప్రకటించినా లాభం ఉండదని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కచ్చితంగా రాజస్థాన్ లో కమలం పార్టీ ఓడిపోవడం ఖాయమని అంచనా వేసింది. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కే ప్రస్తుతానికి సానుకూల వాతావరణం ఉంది. దానికి బీఎస్పీ జత కలిస్తే ఆ రెండు రాష్ట్రాల్లోనూ కూడా బీజేపీకి పరాభం తప్పదనేది ఏబీపీ, సీ ఓటర్ సర్వేల సారాంశం. కాకపోతే కాంగ్రెస్, బీఎస్పీ కలవడం సహా ఇతర బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకోవడంపైనే ఆ రాష్ట్రాల్లో హస్తం పార్టీ గెలుపు సాధ్యమవుతుందని ఆయా సర్వేలు అంచనా వేశాయి.
మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో 15 ఏళ్లుగా బీజేపీయే అధికారం అనుభవిస్తోంది. దీంతో స్వతహాగా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయింది. ప్రజలు ప్రత్యమ్నాయ పార్టీలు, నేతల వైపు చూస్తున్నారు. తొలిసారి ఓటు వేయబోతున్న యువతరం కూడా ఇతర పార్టీల వైపు ఆసక్తి చూపుతోంది. అందుకే ఆ రెండు రాష్ట్రాల్లో ఈ సారి కమలం వికసించకపోవచ్చన్నది సర్వే చెబుతున్న వాస్తవం. వీటన్నింటి కంటే బీజేపీని కలవరపెడుతున్న మరో ప్రధాన అంశం ఏంటంటే 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశవ్యాప్తంగా 27 ఎంపీ స్థానాలకు వివిధ కారణాల వల్ల ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఫలితాల్లో బీజేపీకి ఊహించని ఫలితాలు వచ్చాయి. 27 స్థానాలకు గాను కేవలం 5 చోట్ల మాత్రమే బీజేపీ గెలిచింది. మిగిలిన 22 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులు ఓటమి పాలయ్యారు. అందులో సిట్టింగ్ స్థానాలను కూడా కోల్పోవడం బీజేపీ వైఫల్యానికి నిదర్శనం. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ యాక్సిండెట్లలో చనిపోయారు. అక్కడ సానుభూతిపవనాలు కూడా ఏమాత్రం పని చేయలేదు. చనిపోయినవారి స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్ధులు ఓటమి పాలయ్యారు. వీటి ద్వారా తేలుతున్నది ఏంటంటే మోడీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్నదని. మరోవైపు మిజోరాం, తెలంగాణలోనూ బీజేపీ ప్రభావం ఏమీ కనిపించండం లేదు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ తో పోటీ పడిన బీజేపీ అక్కడ ఎదగడం, బలపడటంలో మాత్రం పోటీ పడలేకపోతోంది. బలమైన నాయకత్వం లేకపోవడంతో కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉన్నా ఈ నాలుగేళ్లలో బీజేపీ కనీస స్థాయిలో కూడా బలపడలేకపోయింది. కొత్తవారిని ఆకర్షించలేక పోగా ఉన్నవారినే కాపాడుకోలేని దుస్థితిలో తెలంగాణ బీజేపీ నాయకత్వం తమ అసమర్ధతను చాటుకుంది. దీంతో మోడీ, అమిత్ షా కేసీఆర్ నే నమ్ముకోవావాల్సిన పరిస్థితి. రహస్య స్నేహంతో తెలంగాణ ఎన్నికలకు వెళ్తున్నారు. కానీ మహాకూటమి నుంచి అక్కడ కేసీఆర్ కు గట్టి సవాల్ ఎదురువుతుండటంతో ఆ నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ బీజేపీ, దాని మిత్రపక్షం టీఆర్ఎస్ కు తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. ఈ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో కూడా బీజేపీ సొంతంగా విజయం సాధించే అవకాశాలు ప్రస్తుతానికి ఏమాత్రం కానరావట్లేదు.