అసలేం జరుగుతోంది…… గుంటూరు నడిబొడ్డున ఆ జనసంద్రం ఏంటి?

వైఎస్‌లకు కడప ఎలాగో తనకు గుంటూరు-కృష్ణా జిల్లాలు అలా ఉండాలన్నది చంద్రబాబు అభిమతం. అలా ఉంటాయన్న ఉద్ధేశ్యంతోనే రాజధాని విషయంలో కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని గుంటూరు-విజయవాడ ప్రాంతాన్ని ఫైనల్ చేశాడు. ఆ ప్రాంత ప్రజలందరూ తనను నమ్మి స్వచ్ఛంధంగా భూములు ఇచ్చారని ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. కానీ కొన్నేళ్ళ పాటు 144 సెక్షన్ ఎందుకు విధాంచాల్సి వచ్చింది అంటే సమాధానం ఉండదు. ఆ విషయం పక్కన పెట్టినా కంపెనీలన్నీ గుంటూరు-విజయవాడకు వస్తున్నాయని ప్రచారం చేశారు. చాలా మంది మేధావులు కూడా చంద్రబాబు పూర్తిగా గుంటూరు-విజయవాడ ప్రాంతాన్నే పట్టించుకున్నాడని విమర్శలు చేశారు.

అలాంటి గుంటూరులో జగన్ ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఏంటి? డబ్బులిచ్చి తెచ్చిన జనాలు అనడం చాలా సులభం. కానీ అలా వచ్చిన జనాలు గోడలు, మిద్దెలు, చెట్ల పైకి ఎక్కి గంటల తరబడి నిరీక్షిస్తారా? చెట్టు, గట్టు, మెట్టు, మేడ అనేదానితో సంబంధం లేకుండా అన్నింటినీ ఆసరా చేసుకుని జగన్ కోసం ఎదురుచూస్తారా? వైకాపా తరలించిన జనాలు కూడా ఉంటారనడంలో సందేహం లేదు. కానీ స్వచ్ఛంధంగా తరలివచ్చిన జనాలు మాత్రం వైకాపా నేతల ఊహలకు కూడా అందని స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఈ విషయమే టిడిపి ముఖ్య నాయకులతో పాటు రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. టిడిపి నాయకుల్లో భయాందోళనలు పెంచుతోంది. అందుకే స్పీకర్ స్థానంలో ఉన్న కోడెల శివప్రసాదరావు కూడా స్పీకర్ స్థాయిని దిగజారుస్తూ టిడిపి మనిషిలా మారిపోయి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఇక ఇతర నాయకుల విషయం చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా, టిడిపి నాయకుల మధ్య జరుగుతున్న చర్చ ఒక్కటే. అసలేం జరుగుతోంది……..గుంటూరు నడిబొడ్డున జగన్‌కి ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఏంటి? టిడిపికి ఆయువు పట్టులాంటి నియోజకవర్గాలు, జిల్లాలు అని చంద్రబాబు ఎంతో నమ్మకంగా ఉన్న చోట కూడా ప్రజలు జగన్‌కి బ్రహ్మరథం పడుతున్నారంటే 2019 ఎన్నికల ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అని అర్థం చేసుకోవాలన్నదే ఆ చర్చ. కృష్ణా జిల్లాలో…..విజయవాడలో కూడా ఇదే స్థాయి జనస్పందన వస్తే మాత్రం ప్రజలకు, అన్ని పార్టీల నాయకులకు కూడా పూర్తి స్పష్టంగా 2019 ఎన్నికల చిత్రం అయితే గోచరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.