ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుండే ప్రణాళికను రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులంతా ప్రజల్లో ఉండేలా కార్యచరణ సిద్ధం చేసిన సీఎం జగన్…మరోవైపు పార్టీలో చేరికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను పార్టీలోకి తిరిగి చేర్చుకునేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
వాస్తవానికి కొణతాల తొలుత టీడీపీలో ఆ తర్వాత జనసేనలో చేరుతారని ప్రచారం జరిగిన ఆయన వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం నుండి డాక్టర్ భీశెట్టి సత్యవతి పోటీ చేసి గెలవగా ఇప్పుడు ఈ స్థానాన్ని కొణతాలకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 1989లో అనకాపల్లి నుండి తొలిసారిగా ఎంపీగా గెలిచారు. తర్వాత 1991లో రెండోసారి గెలవగా 2004లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్సార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. జిల్లాల్లో ఆయనకు మంచిపట్టు ఉంది.
వైఎస్ మరణానంతరం జగన్ వెంట నడిచారు. అయితే తర్వాత గ్యాప్ రావడంతో దూరంగా ఉంటు వస్తుండగా తిరిగి వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొణతాల ఎంపీగా పోటీ చేస్తే అనకాపల్లి రూరల్ జిల్లాలో మొత్తం అసెంబ్లీ సీట్లు వైసీపీ గెలవడంలో కీలక పాత్ర పోషిస్తారని అంచనా. మొత్తంగా కొణతాల వైసీపీలోకి వస్తారన్న వార్త ఆయన అభిమానుల్లో జోష్ నింపుతోంది.