ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. కొవిడ్ వ్యాప్తి అనంతరం విదేశీ పర్యటన చేయడం తొలిసారి. బంగ్లాదేశ్ స్వాతంత్ర స్వర్ణోత్సవాల్లో గౌరవ అతిథిగా పాల్గొనాలని ప్రధాని మోదీని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆహ్వానించింది. వారి ఆహ్వానం మేరకు బంగ్లాలో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. నేడు, రేపు మోదీ బంగ్లాదేశ్ లో పర్యటించి, రెండు దేశాల మధ్యా ద్వైపాక్షిక, వాణిజ్య, రక్షణ, ఆర్థిక సంబంధాల బలోపేతంపై బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో ప్రత్యేక చర్చలు జరపనున్నారు.

బంగ్లాదేశ్ జాతిపిత, బంగ బంధు షేక్ ముజిబుర్ రహమాన్ శత జయంత్యుత్సవంలోనూ నరేంద్ర మోదీ హాజరవనున్నారు. ఇటీవల ముజిబుర్ రహమాన్‌కు భారత్ గాంధీ శాంతి పురస్కారం (2020) ప్రకటించింది. భారత ప్రధాని మోదీ టుంగిపారాలో బంగబంధు ముజిబ్ స్వగృహాన్ని సందర్శించి అంజలి ఘటిస్తారు.
అలాగే పశ్చిమ బంగ్లాకు సరిహద్దుకు సమీపంలో ఉన్న జెసోరేశ్వరియా కాళీ ఆలయంతో పాటు మరో ఆలయంలో పూజలు చేయనున్నారు. కరోనా మహమ్మారి తరువాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న వేళ, మోదీ తొలి విదేశీ పర్యటన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ నుంచి మొదలవుతోంది.