Sunday, June 16, 2024
- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీకి అభ్య‌ర్థులు కావ‌లెను

- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ రాష్ట్రంలోని 175 స్థానాల్లోనూ పోటీ చేస్తుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. కానీ.. ఆయ‌న పార్టీ త‌ర‌ఫున పోటీ చేసేందుకు ఇప్ప‌టివ‌ర‌కైతే అభ్య‌ర్థులు ఎవ‌రూ ఖ‌రారు కాలేదు. అస‌లు ఖ‌రారు చేసేందుకు రాజ‌కీయ అనుభ‌వం, ఇమేజ్ ఉన్న పెద్ద నేత‌లెవ‌రూ ఇంత‌వ‌ర‌కూ ప‌వ‌న్ పార్టీలో చేరింది లేదు. ఒక‌వేళ ప‌వ‌న్ ముందుగా ప్ర‌క‌టించిన‌ట్టు ఎలాంటి అనుభ‌వం లేని కొత్త‌వారికి అవ‌కాశం క‌ల్పిస్తాన‌నేది వాస్త‌వ‌మైతే.. ఇంక ఇమేజ్ ఉన్న రాజ‌కీయ నాయ‌కుల‌తో ప‌నిలేదు. కానీ.. ప్ర‌స్తుతం రాజ‌కీయాలంటే డ‌బ్బు, అనుచ‌ర‌గ‌ణం ఉన్న నాయ‌కుల అవ‌స‌రం చాలా ఎక్కువ‌. ఇవేవీ లేని వారిని అస‌లు రాజ‌కీయ నాయ‌కులుగానే ప్ర‌జ‌లు సైతం గుర్తించేందుకు ఆస‌క్తి చూప‌ని ప‌రిస్థితులున్నాయి. పార్టీ ఏదైనా.. అభ్య‌ర్థి ఎవ‌రైనా ఖ‌చ్చితంగా ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల స‌త్తా ఉండాలి. లేదంటే ప్ర‌జ‌లు అస‌లు గుర్తించే ప‌రిస్థితే ఉండ‌దు. అంతా కొత్త‌వారికే సీట్ల‌ను కేటాయించి.. స్వ‌చ్ఛ రాజ‌కీయాల‌కు నాంది ప‌లుకుతామంటూ ప‌వ‌న్ ప్ర‌క‌టించిన‌ట్టుగా చేస్తే.. ఆయ‌న త‌ప్ప ఇంకెవ‌రూ గెలిచే ప‌రిస్థితి ఉండ‌దు.

లోక్‌స‌త్తా పార్టీని స్థాపించి.. ఇలాగే ప్ర‌క‌ట‌న‌లు చేసి త‌న ప్ర‌సంగాల‌తో యువ‌త‌ను ఉర్రూత‌లూగించిన జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ లాంటి వాళ్ల‌కు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో ఎంత ప‌రాభవం ఎదురైందో.. ప‌వ‌న్ ప‌రిస్థితీ అలాగే మారుతుంది. ముల్లును ముల్లుతోనే తీయాల‌నే పాత సామెత ఇప్ప‌టికీ రాజ‌కీయాల్లో కొన‌సాగుతుండ‌డ‌మే దీనికి కార‌ణం. ఒక పార్టీ ఓటుకు రూ.వెయ్యి ఇస్తే.. మ‌రో పార్టీ అంత‌కు రెట్టింపు ఇస్తేనే ప‌ని జ‌రుగుతుంద‌నే అవినీతిమ‌య వ్య‌వ‌స్థ‌లో ఉన్న‌ప్పుడు.. నీతులు వ‌ల్లిస్తే ఎక్కించుకునే వారుండ‌రు. ఈ విష‌యం ప‌వ‌న్‌కు సైతం బాగానే తెలుసు. అందుకే.. ఏ వేదిక నెక్కినా.. త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ని, ఒక‌వేళ ఎదుటి పార్టీల వాళ్లు ఇస్తే తీసుకోమ‌ని.. ఓట్ల‌ను మాత్రం జ‌న‌సేన‌కే వేయాలంటూ స‌రికొత్త గ‌ళాన్ని ఎత్తుకున్నారు. అయితే.. ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌ల‌ను ఎంత‌మంది చెవికెక్కించుకుంటార‌నేది సందేహాస్ప‌ద‌మే. రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఉన్న తెలుగుదేశం, వైకాపాలు చాలా బ‌లంగా ఉన్నాయి. బ‌ల‌మైన నాయ‌కులు, డ‌బ్బు, అనుచ‌ర‌గ‌ణం పుష్క‌లంగా ఉన్న పార్టీల‌వి. వాటిని ఢీకొట్టాలంటే ప‌వ‌న్ బ‌లం, బ‌ల‌గం కూడా అంతే ప‌టిష్టంగా వ‌చ్చే ఆరు నెలల్లో రూపుదాల్చాల్సి ఉంది.

చిరంజీవి ప్ర‌జారాజ్యం పెట్టిన త‌ర్వాత నుంచి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి వ‌ర‌ద‌లా పేరున్న రాజ‌కీయ నాయ‌కులు వ‌చ్చి చేరారు. దీంతో వారికి ప్ర‌త్యేకంగా రాజ‌కీయ పాటాలు నేర్పించి.. రంగంలోనికి దించాల్సిన ప‌నిలేకుండా.. వారే రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టుకున్నారు. చిరంజీవి కేవ‌లం ప్ర‌చారానికి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. ఎదుటి పార్టీల‌కు దీటుగా ప్ర‌జారాజ్యం నేత‌లు కూడా అన్నింటిలోనూ పోటీ ప‌డ్డారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. ప్ర‌జారాజ్యం పార్టీ టిక్కెట్లిచ్చిన నాయ‌కుల్లో 99శాతం బాగా డ‌బ్బున్న‌, పేరున్న వారే. మిగ‌తా ఒక్క‌శాత‌మే చిరంజీవి అభిమాన సంఘాల నేత‌లు, పార్టీకి వెన్నుద‌న్నుగా నిలిచిన వారికి ఇచ్చారు. అందుకే చిరంజీవి ఇమేజ్, స‌ద‌రు నేత‌ల చ‌రిష్మా క‌లిసి.. పోటీ చేసిన మొద‌టి సారే 2009లో ప్ర‌జారాజ్యానికి గ‌ణ‌నీయంగా 18శాతం ఓట్ల‌ను సాధించ‌గ‌లిగింది. ఆ ఏడాది ద‌శాబ్దాల అనుభ‌వం ఉన్న కాంగ్రెస్‌కు కోటీ 53 ల‌క్ష‌ల ఓట్లు, తెలుగుదేశం పార్టీకి కోటీ 18 ల‌క్ష‌ల ఓట్లు పోల‌వ్వ‌గా.. ప్ర‌జారాజ్యానికి 68ల‌క్ష‌ల ఓట్లు వ‌చ్చాయి.

ప్ర‌స్తుతం ప‌వ‌న్‌కు అప్ప‌ట్లో చిరంజీవికి ఉన్నంత క్రేజ్ ఉన్నా.. అదొక్క‌టే స‌రిపోదు. క్రేజ్‌తో వ‌చ్చే ఓట్ల‌తో పాటూ.. సొంతంగా ఇమేజ్ ఉన్న నాయ‌కులుంటేనే ఎన్నిక‌ల్లో పోటీ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే.. ప్ర‌జ‌లు గుర్తించే ప‌రిస్థితే ఉండ‌దు. ఎన్నిక‌లు 2019 ఫిబ్ర‌వ‌రి, మార్చిలో జ‌రిగినా.. ఇప్ప‌టినుంచి చూస్తే మ‌రో ఆరేడు నెల‌ల‌కు మించి లేదు. ప‌వ‌న్ ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం ప్ర‌క‌ట‌న‌లు, అధికార‌పార్టీపై ఆరోప‌ణ‌లే త‌ప్ప‌.. త‌న పార్టీ ప‌టిష్ఠ‌త‌పై దృష్టిసారించింది లేదు. పార్టీ పోటీ చేస్తుంద‌ని మాత్ర‌మే చెప్పారు.. త‌ప్ప‌.. ఎవ‌రు పోటీ చేస్తార‌నే క్లారిటీ జ‌న‌సేన‌లో ఇప్ప‌టివ‌ర‌కూ లేద‌ని ఆ పార్టీ నేత‌లే పేర్కొంటున్నారు. మిగ‌తా రెండు పార్టీల త‌ర‌ఫున పోటీ చేసేందుకు ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి ఐదారు మంది ఆశావ‌హులున్నారు. వీరిలో స‌రైన అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌డ‌మే వారి ముందున్న ఏకైక అంశం. ఒక‌వేళ ఆ పార్టీల్లో టిక్కెట్లు ఆశించి.. భంగ‌ప‌డిన వాళ్లు ప‌వ‌న్ పార్టీ వైపు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది. కానీ.. వాళ్ల‌ను ప‌వ‌న్ చేర్చుకునే ప‌రిస్థితి ఉండ‌క‌పోవ‌చ్చు. మ‌రి ప‌వ‌న్‌.. ఈ కొద్దికాలంలో ఏం చేస్తారో.. ఎన్నిక‌ల‌కు త‌న శ్రేణుల‌ను ఎలా స‌న్న‌ద్ధం చేస్తారో వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -