దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల రాజకీయ రంగ ప్రవేశం గురించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ ఎస్, బీజేపీ సోషల్ మీడియా వారియర్లు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ పార్టీ ఓట్లు చీల్చేందుకే సీఎం కేసీఆర్ వేసిన ప్లాన్ ఇదని, నేరుగా ఎదుర్కోలేక ఇలాంటి ఎత్తులు వేస్తున్నారంటూ కాషాయ దళం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే, టీఆర్ ఎస్‌ను ఢీకొట్టే దమ్ములేక బీజేపీ అధిష్టానం ఏపీ సీఎం వైఎస్ జగన్తో కలిసి తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారని ఆ పార్టీ అభిమానులు మండిపడుతున్నాయి.
మరోవైపు, తమ పార్టీకున్న బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసేందుకే టీఆర్ ఎస్, బీజేపీ వేసిన ఎత్తుగడ ఇదని కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు వాదిస్తున్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు షర్మిల పొలిటికల్ ఎంట్రీపై తమదైన భాష్యాలు చెబుతున్నారు. అయితే, ఏ పార్టీ ప్రధాన నాయకులు కూడా ఈ విషయంపై ఏకపక్షంగా స్పందించలేదు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మాత్రం, వైఎస్ కుమార్తెగా షర్మిలను ఆదరిస్తామని, పోటీకి దిగితే మాత్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వేరే వాళ్లకు అధికారం కట్టబెట్టే ప్రస్తక్తే లేదంటూ ఉద్యమకాలం నాటి భావనల గురించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
ఇక వీటన్నింటికంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏవిధంగా స్పందిస్తారన్న అంశం ఆసక్తిని రేపింది. ఈ విషయంపై నేరుగా స్పందించని బాబు.. షర్మిలకు ఆమె అన్న వెన్నుపోటు పొడిచాడు. కుటుంబస భ్యులను మోసం చేశాడు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో బాబుపై సోషల్ మీడియాలో టన్నుల కొద్దీ జోకులు పేలుతున్నాయి. ముఖ్యంగా వెన్నుపోటు అన్న పదం గురించి ఆయన మాట్లాడటాన్ని హైలెట్ చేసి వైఎస్ కుటుంబ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఆనాడు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి, ఆపదానికి పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి నేడు ఈ మాట అనడం విడ్డూరంగా ఉంది. షర్మిలమ్మ తనకు అన్న ఆశీసులు ఉంటాయని చెప్పారని, అన్నకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదని, అదే గతంలో ఎన్టీఆర్ మాత్రం మీడియా సమావేశాల్లోనే బాబు తనను ఎలా మోసం చేశాడో పూస గుచ్చినట్టు చెప్పిన విషయాన్ని మరవవద్దు అని కామెంట్లు చేస్తున్నారు. బాబు తీరు చూస్తుంటే నవ్విపోదురు నాకేంటి సిగ్గు అన్నట్లు ఉందని దుమ్మెత్తిపోస్తున్నారు.
Also Read
తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా!
షర్మిల పార్టీ ప్రకటనపై స్పందించిన హరీష్ రావు
బ్రౌన్ రైస్ తో ఎంతో మంచి ఆరోగ్యం!
మేలో మెగా మేనల్లుడు సాయి తేజ్ పెళ్లి!