Sunday, June 16, 2024
- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధైర్యం అదే.. అందుకే రూటు మార్చాడు

- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకుని.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంతో ఢీఅంటే ఢీఅన్న‌ట్టుగా ఒక్క రాత్రిలో ఎదురు తిరిగారు. గుంటూరు స‌భ జ‌రిగే వ‌ర‌కూ ఒక‌లా.. త‌ర్వాత నుంచి మ‌రోలా ప‌వ‌న్ వ్య‌వ‌హారం పూర్తిగా రాజ‌కీయ విశ్లేష‌కుల‌కు సైతం అంతుప‌ట్ట‌నంత‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం రాష్ర్టంలో శ్రీకాకుళం నుంచి మొద‌లెట్టిన బ‌స్సు యాత్ర‌లో చంద్ర‌బాబు, మంత్రులు, పోల‌వ‌రం, ఉద్ధానం.. స‌హా ఏ అంశాన్ని వ‌ద‌లిపెట్ట‌కుండా తూర్పార‌బ‌డుతున్నాడు. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికే త‌న‌కు స్థాయి లేద‌ని, ఎన్ని స్థానాల‌నేది త‌ర్వాత చెబుతామంటూ దాట‌వేస్తూ వ‌చ్చిన ప‌వ‌న్ స్వ‌రంలో పూర్తిగా మార్పొచ్చింది. అవ‌కాశం ఇస్తే ముఖ్య‌మంత్రిగా అవుతానంటూ జ‌గ‌న్ బాట‌లోనే ప‌వ‌న్ కూడా స‌భ‌ల్లో బ‌హిరంగంగానే ప‌ద‌వి గురించి త‌న వ్యామోహాన్ని ప్ర‌క‌టించ‌డం మొద‌లెట్టాడు. ప‌ద‌వితో ప‌నేముంది.. ఎవ‌రైనా పోరాడొచ్చు, జ‌నం స‌మ‌స్య‌లే త‌న ప్ర‌ధాన అజెండా అంటూ చెప్పుకొచ్చే ప‌వ‌న్‌లో ఇంత మార్పు.. అదీ ఒక్క రాత్రిలో ఎందుకొచ్చింద‌నేది అంద‌రిలోనూ అనేక ప్ర‌శ్న‌లు, సందేహాల‌కు తావిచ్చింది. ప‌వ‌న్‌ను బీజేపీ ఆడిస్తోంద‌ని, గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ స‌యోధ్య కుదిర్చార‌ని, ప‌వ‌న్ పెన్‌డ్రైవ్‌లు బీజేపీ ద‌గ్గ‌రున్నాయ‌ని.. ఇలాంటి పుకార్లు చాలానే పుట్టుకొచ్చాయి. కానీ.. వీట‌న్నింటికీ మించి.. ప‌వ‌న్ రూటు మార్చ‌డం వెనుక ఓ కార‌ణం ఉంది. అందుకే.. అంత ధైర్యంగా తాను ముఖ్య‌మంత్రి అవ్వ‌గ‌ల‌నంటూ బాహాటంగానే చెప్పుకునేందు న‌మ్మ‌కం, ధైర్యం ప‌వ‌న్‌లో వ‌చ్చాయి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ప్ప‌టి నుంచి మూడు నెల‌ల‌ కింద‌ట మార్చిలో జ‌రిగిన గుంటూరు గ‌ర్జ‌న వ‌ర‌కూ చంద్ర‌బాబుకు, ఆయ‌న ప్ర‌భుత్వానికి వ‌త్తాసు ప‌లుకుతూనే ఉన్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే చంద్ర‌బాబు స‌ర్కారు సైతం ప‌వ‌న్ నోరు విప్పి ఏదైనా స‌మ‌స్య‌ను చెబితే.. వెంట‌నే ప‌రిష్క‌రిస్తూ వ‌చ్చింది. అందుకే.. రాష్ర్టంలోని ఉద్యోగ సంఘాల నుంచి విద్యార్థులు, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు, రాజ‌ధాని భూముల రైతులు, ఉద్దానం కిడ్నీ బాధితులు.. ఇలా అంద‌రూ చంద్ర‌బాబును క‌లిసి ప్ర‌యోజ‌నం లేద‌ని.. ప‌వ‌న్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌డం మొద‌లెట్టారు. మీరు చెబితే చాలు.. మా స‌మ‌స్యను ప్ర‌భుత్వం వెంట‌నే ప‌రిష్క‌రిస్తుందంటూ ప‌వ‌న్‌కు చెప్ప‌డం.. ఆయ‌న ప‌లు సంద‌ర్భాల‌లో ఇబ్బంది ప‌డ‌డం జ‌రుగుతూ వ‌చ్చింది. త‌న‌కు అంత శ‌క్తిలేదంటూనే ప‌వ‌న్ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వంతో ప‌రిష్క‌రిస్తూ వ‌చ్చారు. దీంతో ప‌వ‌న్‌ను చంద్ర‌బాబు తొత్తంటూ వ్య‌తిరేక మీడియా ఉతికి ఆరేసింది. క‌థ ఇలా సుఖాంతంగా జ‌రుగుతుండ‌గా.. ఒక్క‌సారిగా గుంటూరులో గ‌త మార్చి 14న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ భారీ బ‌హిరంగ స‌భ‌ను పెట్టారు. దానిలో కేంద్రాన్ని, మోడీని, రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్ఆర్‌సీపీ, దాని అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ప‌వ‌న్ ఉతికేస్తాడ‌ని అంతా ఊహించారు. అందుకే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌వ‌న్‌కు జ‌డ్ కేట‌గిరి స్థాయి భ‌ద్ర‌త‌, అడుగ‌డుగునా ర‌క్ష‌ణ క‌వ‌చం ఏర్పాటు చేసి వేదిక నెక్కించింది. కానీ.. అంద‌రి అంచ‌నాల‌నూ తారుమారు చేస్తూ.. త‌న‌కు కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంద‌న్న‌ట్టుగా ప‌వ‌న్ వేదిక ఎక్కాక యూట‌ర్న్ తీసుకున్నాడు. మోడీని, జ‌గ‌న్‌ను వ‌దిలేసి.. పూర్తిగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై దాడి చేశాడు. అంతా అవినీతిమ‌యం, మంత్రులు ఎక్క‌డెక్క‌డ ఎంతెంత తిన్నారు, ఎమ్మార్వో వ‌న‌జాక్షిని మీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కొడ‌తాడా.. వాడిని బెల్ట్‌తో గుడ్డ‌లూడ‌దీసి కొట్టాలంటూ.. అత్యంత ప‌రుష ప‌ద‌జాలంతో.. ఇంత జ‌రుగుతున్నా.. మీరేం చేస్తున్నారంటూ.. ఎప్పుడెప్పుడో జ‌రిగిన విష‌యాల‌న్నింటినీ.. ఇప్పుడే జ‌రిగాయ‌న్న‌ట్టుగా చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. అదీ చాల‌ద‌న్న‌ట్టుగా.. మీ కొడుకు లోకేష్ అవినీతి హ‌ద్దులు దాటిపోయిందంటూ మ‌రో బాంబు పేల్చారు. దీంతో చంద్ర‌బాబు, ఆయ‌న పార్టీ నాయ‌కుల ముఖాల్లో నెత్తుటి చుక్క లేకుండాపోయింది. ఇంక అప్ప‌టినుంచి ప‌వ‌న్ పంథా పూర్తిగా స‌ర్కారు వ్య‌తిరేక‌మైపోయింది. అవ‌కాశం దొరికితే చంద్ర‌బాబుపై పంచ్‌లు, హెచ్చ‌రిక‌ల‌తో.. మీకు చుక్క‌లు చూపెడ‌తా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసేది మేమే అంటూ ప‌వ‌న్ ప్ర‌క‌టిస్తున్నారు. ప‌వ‌న్ ధైర్యానికి అస‌లైన కార‌ణం.. తెలిస్తే ఎవ‌రైనా ఇదే అంటారు.

మొన్న ప‌క్క‌నే ఉన్న కర్నాట‌క రాష్ట్రంలో జ‌రిగిన మేజిక్ మ‌న ద‌గ్గ‌రా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌ర‌గ‌బోతోంది. క‌ర్నాట‌క‌లో అత్య‌ధిక సీట్లు సాధించిన బీజేపీ, త‌ర్వాత స్థానంలో నిలిచిన కాంగ్రెస్ కాకుండా.. ఆఖ‌రి స్థానంలో నిలిచిన కుమార‌స్వామి అధికార పీఠంపై తిష్ఠ‌వేశాడు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ కాబోతోంది. రాష్ట్రంలో ఉన్న‌వి 175 సీట్లు.. వాటిలో 88 వ‌స్తే ముఖ్య‌మంత్రి అయిపోవ‌చ్చు. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా పోటీప‌డిన పార్టీలు తెలుగుదేశం, వైఎస్ ఆర్ సీపీలు మాత్ర‌మే. దీంతో వారిద్ద‌రూ ఒక‌రు 102, మ‌రొక‌రు 66 గెలుచుకున్నారు. మిగ‌తా ఏడింటిలో నాలుగు తెలుగుదేశం పార్టీ మ‌ద్ద‌తుతో బీజేపీ గెలిచింది. మిగ‌తా మూడు ఇత‌రులు గెలిచారు. కానీ.. ఈసారి త్రిముఖ పోరు ఉండ‌బోతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం గ‌ట్టిపోటీని ఇవ్వ‌బోతున్నారు. గ‌తంలో చిరంజీవి పోటీ చేసిన‌ప్పుడు ఏకంగా 68ల‌క్ష‌ల‌కు పైగా ఓట్లు ఆయ‌న పార్టీకి వ‌చ్చాయి. ఆయ‌న గెలిచిన 18 సీట్ల‌లో రెండు మాత్ర‌మే తెలంగాణ‌.. మిగ‌తా 16 ఏపీలోనే వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌కు అంత‌కంటే ఎక్కువే రావొచ్చ‌ని అంచ‌నాలున్నాయి. రాష్ట్రంలోని మూడు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల‌కు ఈ మూడు పార్టీలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాయి. తెలుగుదేశం క‌మ్మ‌, వైఎస్ ఆర్ కాంగ్రెస్ రెడ్డి వ‌ర్గాల‌కు చెందిన‌వ‌ని ఇప్ప‌టికే అంద‌రిలోనూ బ‌లంగా నాటుకుపోయింది. కాపు వ‌ర్గానికి ఇప్పుడు జ‌న‌సేన వ‌చ్చింది. ఈ మూడు పార్టీలు త‌మ‌కు కులాల‌తో సంబంధం లేద‌ని చెప్పినా.. ఆయా కులాలు మాత్రం ఎవ‌రికి వారు ఇప్ప‌టికే త‌మ సొంత పార్టీలుగా వీటిని చెప్పుకుంటున్నారు. ప్ర‌స్తుతం ముద్ర‌గ‌డ ప్ర‌భావంతో కాపు గ‌ళం బ‌లంగా రాష్ట్రంలో వినిపిస్తోంది. వ‌ద్ద‌న్నా.. వీరు ప‌వ‌న్ వైపే మొగ్గు చూపుతారు. అందుకే.. ప‌వ‌న్ ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌క‌పోయినా.. క‌నీసం పాతిక నుంచి 40 సీట్ల‌ను సాధిస్తాడ‌నే అంచ‌నా ఉంది. 175లో 30 సీట్లు త‌గ్గినా.. మిగిలిన‌వి 145 ఉంటాయి. దీనిలో తెలుగుదేశం, వైఎస్ ఆర్ సీపీ పార్టీల‌కు గ‌త ఓటింగ్ ప‌రంగా చూసినా స‌మాన బ‌లం ఉంది. కేవ‌లం రెండు శాతం ఓట్లు మాత్ర‌మే వీరి మ‌ధ్య ఉన్నాయి. అంటే.. చెరో 70 సీట్లు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. అప్ప‌డు.. ఖ‌చ్చితంగా అధికారం కోసం మ‌రో 18 సీట్లు అవ‌స‌రం. దానికోసం ప‌వ‌న్‌పై ఆధార‌ప‌డ‌క త‌ప్ప‌దు. అయితే.. ప‌వ‌న్‌ను సీఎం చేయ‌డం, లేదంటే.. త‌మ‌కు ఆయ‌న మ‌ద్ద‌తు తీసుకోవ‌డం జ‌ర‌గాల్సి ఉంటుంది. ఇదీ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఉన్న అస‌లైన బ‌లం. అందుకే.. త‌న అవ‌స‌ర‌మే వారికుంటుంది త‌ప్ప‌.. త‌న‌కేం ఉండ‌ద‌నే లెక్క‌లో ప‌వ‌న్ ప్ర‌స్తుతం త‌న జోరు, విమ‌ర్శ‌ల్లో ప‌దును పెంచారు. ఈ లెక్క చంద్ర‌బాబుకూ తెలియ‌డం కొస‌మెరుపు. అందుకే.. వ‌ప‌న్ క‌ళ్యాణ్ ఎంత తిట్టినా, రెచ్చ‌గొట్టినా.. మీరు సామ‌ర‌స్య‌పూర్వ‌కంగానే ప‌వ‌న్‌తో మెల‌గాలంటూ త‌మ శ్రేణుల‌కు ఇప్ప‌టికే సూచించాడు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే.. ఈ విష‌యం జ‌గ‌న్‌కు సైతం తెలియడం. అందుకే.. జ‌గ‌న్ సైతం ప‌వ‌న్ విష‌యంలో ఎలాంటి మాటా జార‌డం లేదు. అవ‌స‌ర‌మైతే మ‌ద్ద‌తు ఇస్తామ‌న్న‌ట్టుగా ఇటీవ‌ల ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా లాంటి వాళ్లు ప‌వ‌న్‌కు శ్రీరెడ్డి విష‌యంలో బాస‌ట‌గా నిల‌వ‌డం వెనుక అస‌లు అంత‌రార్థం ఇదే. సో.. అద‌న్న‌మాట ప‌వ‌న్ ధైర్యం. ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం వ‌స్తున్న‌ప్పుడు ఎందుకు వ‌దులుకోవ‌డం.. ఆ విష‌యంపై మ‌రింత దృష్టిపెడితే త‌ప్పేముందంటూ ప‌వ‌న్ వ‌ర్గం.. ఆ దిశ‌గా పావులు క‌దుపుతోందిప్పుడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -