ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు పాలనలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయని ఆయన ఆరోపించారు.
ఎన్నిక ఏదైనా సరే చివరికి టోటల్ ప్రజాస్వామ్యమే రిగ్గింగ్‌గా మారుతోందని జగన్ విమర్శించారు. గొర్రె తోలు కప్పుకున్న తోడేలులా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి వస్త్రాపహరణం జరుగుతోందని ఆయన తీవ్ర పదజాలంతో విమర్శించారు.
నామినేషన్లు వేయనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారని జగన్ ఆరోపించారు. పోలింగ్ బూత్‌లను ఆక్రమించి ఓట్లను అపహరిస్తున్నారని ఆయన తెలిపారు. గెలిచిన వారిని ఓడినట్లుగా ప్రకటిస్తున్నారని విమర్శలు గుప్పించారు. పోలీసులు, ఆర్వోలు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఎన్నికల ఫలితాలను శాసిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఐదేళ్ల తమ పాలనలో రాష్ట్రం ఎంతో సుస్థిరంగా, శాంతియుతంగా ఉందని జగన్ గుర్తుచేశారు. అలాంటి ప్రశాంతమైన రాష్ట్రానికి నేడు రక్తపు మరకలు అంటించారని మండిపడ్డారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలపై జరిగిన హత్యాయత్నాలు చంద్రబాబు మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలని ఆయన పేర్కొన్నారు.
ఇంటిపై వందల మందితో దాడి చేసి చంపడానికి ప్రయత్నించినా బాధితులపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరాచకాలను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతూ ‘హే రామ్.. సేవ్ ఆంధ్ర’ అంటూ ఆయన నినదించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

