ప్రముఖ నటి రష్మిక (Rashmika Mandanna) తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, సినీ జీవితం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కిన ‘మైసా’ (Mysaa) చిత్రంతో ఆమె త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో పాటు ట్రోలింగ్, వైవాహిక జీవితంపై ఆమె స్పందించారు.
నటిగా తనపై వచ్చే విమర్శలను, ట్రోలింగ్‌ను తాను భరించగలనని రష్మిక చెప్పారు. కానీ, సినీ రంగానికి సంబంధం లేని తన కుటుంబ సభ్యులు, స్నేహితులను ట్రోల్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోనని ఆమె స్పష్టం చేశారు. అలాంటి సమయాల్లో తన స్పందన పూర్తిగా వేరేలా ఉంటుందని హెచ్చరించారు. విమర్శలు ఎదుర్కొనేకొద్దీ తాను మరింత స్ట్రాంగ్ అవుతున్నానని తెలిపారు. ఇబ్బందిగా అనిపించినప్పుడు తన పనిపై, వర్కవుట్లపై మాత్రమే దృష్టి పెడతానని వెల్లడించారు.
‘మైసా’ సినిమా విశేషాలను కూడా ఆమె పంచుకున్నారు. గోండు తెగకు చెందిన ఓ యువతి పరిస్థితుల ప్రభావంతో యోధురాలిగా ఎలా మారిందన్నదే ఈ చిత్ర కథ అని తెలిపారు. తనకు ఎత్తులంటే విపరీతమైన భయం అని, ఈ సినిమాలో ఏకంగా 90 అడుగుల ఎత్తు నుంచి డూప్ లేకుండా కిందకు దూకే సాహస స్టంట్ చేశానని చెప్పారు. ఎలా దూకాలని ఎవరినీ అడగకుండా వెనక్కి దూకేశానని, దాంతో గాలిలో తన శరీరం తలకిందులైందని వివరించారు. ఆ క్షణంలో అంతా అయిపోయిందనుకున్నానని, అమ్మానాన్న, చెల్లి, విజయ్ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. పైకి లాగిన తర్వాత భయంతో బాగా ఏడ్చేశానని ఆమె గుర్తుచేసుకున్నారు.
పెళ్లి తర్వాత తన జీవితం చాలా సంతోషంగా ఉందని రష్మిక ఆనందం వ్యక్తం చేశారు. తాను కలలు కన్న జీవితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నానని తెలిపారు. మా రెండు కుటుంబాలు ఎంతో అన్యోన్యంగా కలిసిపోయాయని చెప్పారు. విజయ్ దేవరకొonda (Vijay Deverakonda)లో తనకు అత్యంత ఇష్టమైంది ఆయన లోతైన ప్రేమ అని పేర్కొన్నారు. ఆయన మాటల్లో చెప్పకపోయినా ఆ ప్రేమ స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. మా ఇద్దరికీ స్వీట్లు, డెజర్ట్స్ అంటే చాలా ఇష్టమని, రోజూ షూటింగ్ ప్యాకప్ కాగానే విజ్జుకి మెసేజ్ చేస్తానని ముసిముసి నవ్వులతో చెప్పారు.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ గురించి కూడా ఆమె మాట్లాడారు. నిజానికి తాను ఇంట్లో కూడా ఎప్పుడూ పాటలు పాడనని, సంగీతం తనకు పూర్తిగా కొత్త ప్రపంచమని చెప్పారు. కానీ, సుబ్బులక్ష్మి గారి జీవితాన్ని నేటి తరానికి చెప్పాల్సిన అవసరం ఉందనిపించి ఈ ఛాలెంజ్ తీసుకున్నానని తెలిపారు. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా సంగీతం నేర్చుకోబోతున్నానని చెప్పారు. ఒకప్పుడు ఒకేసారి నాలుగైదు సినిమాలు చేసేదాన్ని, కానీ ఇప్పుడు నటనపై పూర్తి దృష్టి పెట్టేందుకు ఒకేసారి ఒకటి లేదా రెండు సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నానని రష్మిక స్పష్టం చేశారు. నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మైసా’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

