మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఈ ఉదయం వివేకా సోదరుడు రాంనారాయణ రెడ్డికి ఫోన్ చేసి ఓదార్చిన జగన్, ఆ తరువాత ఆయన కుమారుడు విజయ్ కుమార్ రెడ్డితోనూ మాట్లాడారు.
వివేకా మృతితో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, పాదయాత్రలో ఉన్నందున స్వయంగా పరామర్శించడానికి రాలేక పోతున్నానని, తరువాత స్వయంగా వస్తానని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, ఆనం సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వేళ వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండేవారన్న సంగతి తెలిసిందే. ఆనం రెండోతరం వారసులు త్వరలో వైసీపీలో చేరనున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, వీటిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.
ప్రోస్టేట్ క్యాన్సర్తో హైదరాబాద్లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆనం వివేకానందరెడ్డి బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. చికిత్సకు శరీరం సహకరించక తన సోదరుడు తుదిశ్వాస విడిచినట్లు ఆయన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఆనం వివేకానందరెడ్డి భౌతికాయానికి నెల్లూరులో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
