ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. పార్టీ విషయమై వైఎస్సార్ సన్నిహితులు, ఆయన అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడానికి ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారని ప్రచారం జరుగుతోంది. తన భర్త బ్రదర్ అనిల్‌తో కలిసి అందరితో చర్చించి ఈనెల 9న కొత్త పార్టీని ప్రకటించే యోచనలో ఆమె ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. తన తండ్రికి కలిసి వచ్చిన చేవెళ్ల నియోజకవర్గం నుంచే షర్మిల పాదయాత్ర ప్రారంభించి రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసుకోనున్నారనే మాటలు వినిపిస్తున్నారు.
అంతేకాదు తనను నిర్లక్ష్యం చేసిన అన్న జగన్‌కు తానేంటో నిరూపించుకోవాలనే ఉద్దేశంతోనే షర్మిల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ముఖ్యంగా వైఎస్సార్ కుటుంబంలో నిజంగానే చీలిక వస్తే దానిని తాము ఎలా వాడుకోవాలన్న అంశంపై సీఎం జగన్ రాజకీయ ప్రత్య ర్థులు ఈ అంశం గురించి చిలువలు పలువలుగా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రచారాలు నిజమే అయి, షర్మిలమ్మ నిజంగానే తెలంగాణలో పార్టీ పెడితే తన అన్నకు వచ్చిన నష్టం ఏమిటి? ఏపీలో కాదని పక్క రాష్ట్రంలో ఆమె ఎందుకు పార్టీ పెట్టాలనుకుంటున్నారు?
కొంతమంది ఉద్ధండులు విశ్లేషించినట్లుగా ఇక్కడ టీఆర్ ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌తో షర్మిల నిజంగానే ఢీకొట్టగలరా? తద్వారా తన అన్నకు, కేసీఆర్కు మధ్య విభేదాలు వస్తాయా? అన్న జైలులో ఉన్నపుడు పాదయాత్రతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరులూదిన షర్మిలమ్మ నిజంగానే ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటారా? రాజకీయాల మీద ఆసక్తి లేదని, రాజకీయాల్లోకి రావాల్సిందిగా జగనన్నే స్వయంగా అడిగినా ఇంటరెస్్ట లేదని చెప్పిన ఆయన ముద్దుల చెల్లెలు ఇప్పుడు మరీ ఇంత వ్యతిరేకంగా మారారా? అసలు సీఎం జగన్‌కు తెలియకుండా ఆమె ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోగలరా? వంటి అనేకానేక ప్రశ్నలకు మాత్రం ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు.
అయితే ఈ అన్నాచెల్లెళ్ల అనుబంధం, వైఎస్సార్ పెంపకం గురించి తెలిసిన వాళ్లు మాత్రం జగన్‌కు వ్యతిరేకంగా షర్మిలమ్మ, షర్మిలమ్మను బాధపెట్టేలా జగన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోరని, ఏ విషయమైనా ఇద్దరూ కూలంకషంగా తల్లితో చర్చించిన తర్వాతే జట్టుగా ముందుకు వెళ్తారని, ఇప్పుడు తెలంగాణలో పార్టీ అన్న ప్రచారం నిజమే అయినా జగన్ తెలియకుండా జరిగే అవకాశమే లేదని అంటున్నారు. ఏదేమైనా ఈ చిక్కుముడులు, ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరో రెండు మూడు రోజులు వేచి చూడక తప్పదు!
పెద్దల సభలో అరుదైన సంఘటన.. మోదీ తొలిసారి అలా..