అందరు ఊహించనట్లుగానె రాయలసీమలో జగన్ దెబ్బకొట్టాలన్న బాబు ఆపరేషణ్ ఆకర్శ్ వ్యూహం ఫలించినట్లే కనిపిస్తోంది. ఆపార్టీ నుంచి ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. బుట్టా రేణుక పార్టీ మార్పు అంశం ఊహాగానమే అనుకున్నప్పటికీ.. విశ్వసనీయ వర్గాలు మాత్రం టీడీపీలో ఆమె చేరిక ఖాయమంటున్నాయి. మంగళవారం ఆమె టీడీపీలో చేరడం ఇక లాంఛనమే అంటున్నారు
వైసీపీ నేతల ఫిరాయింపులపై ఇటీవల వార్తలు రావడంతో అప్రమత్తమైన జగన్.. వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో వలసలకు బ్రేక్ పడుతుందనే అంతా అనుకున్నారు. జగనే స్వయంగా రంగంలోకి దిగిన తర్వాత నేతలు వెనక్కి తగ్గడంలేదు. కర్నూలు ఎంపీ సీటుపై రేణుక స్పష్టత కోరినట్టు సమాచారం. స్పందించిన జగన్ ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రతిపాదించారు. దీనికి నిరాకరించిన రేణుక తాను లోక్‌సభకే పోటీ చేస్తానని జగన్‌కు తేల్చి చెప్పారు. ఈ విషయంలో అధినేత నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.
రేణుక ప్రతిపాదనపై జగన్ నుంచి ఎలాంటి హామి రాకపోవడంతో.. పార్టీలో కొనసాగడంపై రేణుక ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ నుంచి ఆమెకు భరోసా లభిస్తున్న సంకేతాలు వస్తుండటంతో పార్టీ మార్పుకే ఆమె మొగ్గుచూపుతున్నారు. జిల్లాలోని రెండు ఎంపీ సీట్లలో ఒకదానిని ఓసీలకు, రెండో దానిని బీసీలకు టీడీపీ ఇస్తూ వస్తోంది. గత ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా అవలంబించారు. రేణుక కనుక టీడీపీలో చేరితే వచ్చేసారి ఆ సీటు ఆమెకే ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం యోచిస్తున్నట్టు సమాచారం.
కర్నూలు జిల్లాలో బలంగా ఉన్న వైసీపీ.. రాను రాను తన పట్టు కోల్పోతున్నట్లే కనిపిస్తోంది. బుట్టా రేణుక విషయంలో మాత్రం జగన్ చేజేతులా నష్టాన్ని కొనితెచ్చుకున్నట్లే అనిపిస్తోంది. ఎమ్మిగనూరు నుంచి బుట్టా రేణుకను పోటీ చేయించడం ద్వారా అక్కడ కూడా టీడీపీకి చెక్ పెట్టాలని జగన్ భావించారు. అయితే రేణుక ఒప్పుకోనట్లు తెలుస్తోంది. గన్ రేణుక మాటను అంతగా లెక్కలోకి తీసుకోకపోవడం వల్లే ఇప్పుడామె పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. ఇదంతా జగన్ స్వయం కృతాపరాధమే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.