కర్నూలు జిల్లారాజకీయాల్లో వైసీపీ, టీడీపీ లు విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. టీడీపీనుంచి వైసీపీలోకి….వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో జిల్లా రాజకీయాల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.వైసీపీకీ చెందిన ఎమ్మెల్యే, ఆమె భర్త పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డిలు త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. గత కొంతకాలంగా అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇద్దరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. అప్పటినుంచి గౌరు చరితారెడ్డి, కాటసాని మధ్య విబేధాలు మొదలయ్యాయి. త్వరలో జరిగే ఎన్నికల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డికే వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్టును ఇవ్వనున్నట్టు సంకేతాలు రావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు అసంతృప్తికి గురయ్యారు. దీంతో గౌరు దంపతులు కార్యకర్తలు, అనుచరులతో సమావేశమయ్యారు. సమావేశంలో పార్టీ మార్పుపై చర్చంచారు.
ఈ సారి ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ గౌరు దంపతులకు హామీ ఇచ్చారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన గౌరు దంపతులు తమ పదువులకు రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం కేఈని కలిసిన తర్వాత టీడీపీలో చేరనున్నారు.