హార్ట్ అటాక్ అనేది అత్యవసర వైద్య పరిస్థితి. ఈ సమయంలో తీసుకునే కొన్ని నిమిషాల సరైన రోగి ప్రాణాలను కాపాడగలవు. అయితే కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల రోగి ప్రాణాలను కొల్పోయే అవకాశం ఉంది. సాధారణంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చుట్టూ ఉన్నవారు భయాందోళనకు గురై, రోగికి నీళ్లు ఇవ్వడం ద్వారా సహాయం చేస్తున్నామని భావిస్తుంటారు. కానీ నిజంగా హార్ట్ అటాక్ సమయంలో నీళ్లు ఇవ్వడం సరైనదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు.
హార్ట్ అటాక్ సమయంలో గుండె కండరాలకు వెళ్లే రక్త సరఫరా అకస్మాత్తుగా తగ్గిపోతుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది. దీనివల్ల తీవ్రమైన ఛాతీ నొప్పి, ఆందోళన, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, అధిక చెమటలు, వికారం, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో రోగి స్పృహ కోల్పోవచ్చు.
హార్ట్ అటాక్ సమయంలో రోగిని నీళ్లు లేదా ఇతర ద్రవాలు తాగమని బలవంతం చేయకూడదు. ఇందుకు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఈ సమయంలో నీళ్లు ఇవ్వడం వల్ల వాంతులు రావచ్చు. దీంతో నీరు ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం (ఆస్పిరేషన్) ఉంటుంది. రోగి పరిస్థితి మరింత విషమిస్తే లేదా స్పృహ కోల్పోతే, నీరు గొంతులో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. అంతేకాదు, కొన్నిసార్లు అత్యవసరంగా మందులు ఇవ్వాల్సి రావచ్చు లేదా యాంజియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఖాళీ కడుపు ఉండటం చాలా అవసరం.
రోగి పూర్తిగా స్పృహలో ఉండి, మాట్లాడగలిగితే, అలాగే డాక్టర్ లేదా వైద్య నిపుణులు అనుమతిస్తే మాత్రమే చాలా తక్కువ పరిమాణంలో నీళ్లు ఇవ్వవచ్చు. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఇది సాధ్యమైనంత వరకు నివారించడమే మంచిది.
()గుండెపోటు సమయంలో చేయాల్సినవి
రోగిని ప్రశాంతంగా ఉంచి కూర్చోబెట్టాలి లేదా సౌకర్యంగా పడుకోబెట్టాలి.
వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయాలి లేదా దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
డాక్టర్ ముందుగా సూచించి ఉంటే మాత్రమే నమిలే ఆస్పిరిన్ ఇవ్వాలి.
బిగువుగా ఉన్న దుస్తులను సడలించాలి.
రోగిని ఒంటరిగా వదిలిపెట్టకూడదు.
()గుండెపోటు సమయంలో చేయకూడనివి
నీళ్లు, టీ, జ్యూస్ లేదా ఇంటి చిట్కాలు ఏవీ ఇవ్వకూడదు.
నొప్పిని గ్యాస్ లేదా ఆసిడిటీ అని నిర్లక్ష్యం చేయకూడదు.
ఆలస్యం చేయకూడదు, ఎందుకంటే ప్రతి నిమిషం విలువైనది.
హార్ట్ అటాక్ సమయంలో నీళ్లు ఇవ్వడం సాధారణంగా కనిపించే కానీ ప్రమాదకరమైన పొరపాటు. అత్యంత సురక్షితమైన చర్య వెంటనే వైద్య సహాయం పొందడమే. సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమే ప్రాణాలను కాపాడుతుంది.
