ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో సైతం లెజెండరీ వికెట్ కీపర్ ఎమ్మెస్ ధోనీని మించిపోయారు. రిషభ్ పంత్ 673 రేటింగ్ పాయింట్లతో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకున్నాడు. ఒక్కసారిగా 21 స్థానాలు ఎగబాకి 17 స్థానంలో నిలిచాడు.
ధోనీ తన కెరీర్‌లో అత్యధికంగా 662 పాయింట్ల మార్క్‌ను అందుకోగా.. పంత్ అతన్ని మించిపోయాడు. ఫలితంగా భారత్ తరఫున బెస్ట్ ర్యాంక్ సాధించిన స్పెషలిస్టు వికెట్ కీపర్ల జాబితాలో ఫరూఖ్ ఇంజనీర్ సరసన నిలిచాడు. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ ర్యాంక్ సాధించిన ఇండియన్ స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. అటు వికెట్ కీపర్‌గా, ఇటు బ్యాట్స్‌మన్‌గా తానేంటో నిరూపించుకున్నాడు. పుజారా తర్వాత సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ పంతే కావడం విశేషం.