అండర్-19 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ సెమీఫైనల్లో అడుగుపెట్టారు. దక్షిణాఫ్రికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మూడు వికెట్ల తేడాతో దాయాది జట్టు ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ సౌతాఫ్రికాను 189/9కే పరిమితం చేసింది.
పాక్ జట్టులో ముహమ్మద్ ముసా 3 వికెట్లు తీయగా, షామిన్ అఫ్రిదీ రెండు వికెట్లు పడగొట్టాడు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడానికి సఫారీ కుర్రాళ్లు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ పాక్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. 74 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన అలీ జర్యాబ్ పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ అలీ జర్యాబ్ అర్ధ సెంచరీతో జట్టును గెలిపించాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఈ విజయంతో పాకిస్థాన్ సెమీఫైనల్ చేరుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు సెమీస్‌లోకి అడుగుపెట్టింది. జనవరి 25న జరగనున్న క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్, అప్ఘాన్ జట్టు తలపడనున్నాయి. భారత జట్టు జనవరి 26న క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.