ప్రపంచకప్‌లో భాగంగా మరి కొద్ది సేపట్లో మరో సమరానికి బంగ్లా, ఇండియాలు సిద్దమవుతున్నాయి. భారత్ కు ఇది క్వార్టర్ ఫైనల్ పోరు వంటిది కాగా, బంగ్లాకు ప్రీ క్వార్టర్ ఫైనల్ పోరని అనుకోవచ్చు. ఇందులో ఇండియా గెలిస్తే, సరాసరి సెమీస్ కు చేరుతుంది. ఇంగ్లండ్ చేతిలో ఓడిన భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ వెల్లేందుకు ఇబ్బందులు లేకుండా చేసుకొనేందుకు పట్టుదలతో ఉంది.
ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో ఇండియా, బంగ్లాదేశ్ లు మూడు సార్లు తలపడగా, ఒకసారి బంగ్లాదేశ్, రెండుసార్లు భారత్ గెలిచాయి. 2007లో పసికూనగా ఉన్న బంగ్లాదేశ్, ఇండియాను గ్రూప్ దశలో ఓడించి, టోర్నీ నుంచి సాగనంపి పెను సంచలనాన్నే సృష్టించింది. దానికి బదులుగా ఇండియా 2011, 2015 సంవత్సరాల్లో జరిగిన పోటీల్లో ఇండియా విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. మరో సారి హ్యాట్రిక్ విజయం కొట్టాలని కోహ్లీసేన కసితో ఉంది.
మరో వైపు తాము లెక్కను సరిచేస్తామని 2015లో ఓటమికి బదులిస్తామని బంగ్లాదేశ్ నమ్మకంతో ఉంది. ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ తో పాటు స్పిన్ బౌలింగ్ పై ఆశలు పెట్టుకుని, భారత స్టార్ ఆటగాళ్లను నిలువరిస్తామని అంటోంది. ఇండియాతో పాటు పాక్ పైనా బంగ్లాదేశ్ గెలిచి, న్యూజిలాండ్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోతే ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు ఉంటాయి.
టోర్నీలో సంచలన విజయాలు నమోదు చేస్తూ దూసుకెళ్తున్న బంగ్లాను కట్టడి చేసేందుకు టీమిండియా అస్త్రాలను సిద్ధం చేసి పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ముగ్గురు సీమర్లను ఆడించే యోచనలో జట్టు యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. లోయర్ ఆర్డన్ పటిష్ఠం చేసేందుకు చాహల్‌ను తప్పించి భువనేశ్వర్ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. కేదార్ జాదవ్‌ను పక్కనబెట్టి.. ఆల్ రౌండర్ జడేజాను తీసుకోవాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం