Tuesday, May 6, 2025
- Advertisement -

ఇండియా క్లీన్ స్వీప్‌…. టీ20సిరీస్ కైవ‌సం…

- Advertisement -

శ్రీలంకతో జరిగిన మూడు టీ 20ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరిదైన మూడో టీ20లో రోహిత్‌ సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో లంకేయుల్ని క్లీన్‌స్వీప్ చేసేసింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు.. గుణరత్నె (36: 37 బంతుల్లో 3×4), శనక (29 నాటౌట్: 24 బంతుల్లో 2×6) నిలకడగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శ్రీలంక విసిరిన 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 39 పరుగులకే ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(4), రోహిత్‌ శర్మ(27) వికెట్లను కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే శ్రేయస్‌ అయ్యర్‌(30), మనీష్‌ పాండే(32)లు ఫర్వాలేదనిపించడంతో పాటు దినేశ్‌ కార్తీక్‌(16 నాటౌట్‌), ఎంఎస్‌ ధోని(18 నాటౌట్‌) చివరి వరకూ క్రీజ్‌లో ఉండి జట్టుకు విజయాన్ని అందించారు.

భారత బౌలర్ల ధాటికి మరోసారి తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకుంది శ్రీలంక‌. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక ఏ దశలోనూ భారత బౌలర్లను ప్రతిఘటించలేకపోయింది. ఆరంభం నుంచే భార‌త బైల‌ర్లు విజృంభించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ అరంగేట్ర ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌తో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బౌలింగ్‌ దాడిని ఆరంభించాడు. సుందర్‌ తొలి ఓవర్‌లో శ్రీలంక ఎలాగో నిలిచింది. కానీ తర్వాతి ఓవర్‌ నుంచి పతనం మొదలైంది. రెండో ఓవర్లో డిక్వెలా (1)ను ఔట్‌ చేయడం ద్వారా లంకను ఉనద్కత్‌ తొలి దెబ్బ తీశాడు. ఆ తర్వాత పతనం ఏ దశలోనూ ఆగలేదు. ఓ వైపు గుణరత్నె (36) నిలిచినా మరోవైపు నుంచి అతడికి సహకారం కరవైంది. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి లంక 67/4తో నిలిచింది. కుశాల్‌ పెరీరా (4)ను రిటర్న్‌ క్యాచ్‌తో ఔట్‌ చేయడం ద్వారా సుందర్‌ తన తొలి టీ20 వికెట్‌ను చేజిక్కించుకున్నాడు. తరంగ (11)ను ఉనద్కత్‌ ఔట్‌ చేయగా.. గుణరత్నెతో నాలుగో వికెట్‌కు 38 పరుగులు జోడించిన సమరవిక్రమ(21)ను పాండ్య వెనక్కి పంపాడు. గుణరత్నె క్రీజులో ఉన్నా ధాటిగా ఆడలేకపోయాడు. 11 నుంచి 15 ఓవర్ల మధ్య 29 పరుగుల చేసిన లంక మరో రెండు వికెట్లు చేజార్చుకుంది. ఐతే ఆఖర్లో శనక (29 నాటౌట్‌; 24 బంతుల్లో 2×6), ధనంజయ (11 నాటౌట్‌; 7 బంతుల్లో 2×4) కాస్త బ్యాటు ఝుళిపించడంతో లంక గౌరవప్రదమైన స్కోరును అందుకుంది. భారత్‌ తరఫున సుందర్‌ (1/22), ఉనద్కత్‌ (2/15) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. సిరాజ్‌ (1/45) ధారాళంగా పరుగులిచ్చాడు.

ఛేదనలో చివరి 7 బంతుల్లో 9 పరుగులు అవసరమైన దశలో భారత్‌ శిబిరంలో ఒత్తిడి కనిపించింది. అయితే.. క్రీజులో మహేంద్రసింగ్ ధోని (16 నాటౌట్: 10 బంతుల్లో 2×4), దినేశ్ కార్తీక్ (18 నాటౌట్: 12 బంతుల్లో 1×6) ఉండటంతో అభిమానులు ధీమాతో ఉన్నారు. ఈ దశలో ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన ప్రదీప్ చివరి బంతిని ఫుల్‌టాస్‌గా విసరగా.. దినేశ్ కార్తీక్ కళ్లు చెదిరే రీతిలో సిక్సర్‌గా మలచడంతో భారత్ విజయం ఖాయమైంది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ రెండో బంతిని ధోనీ బౌండరీకి తరలించి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -