సెంచూరియన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నీంగ్స్‌లో సఫారీ జట్టు ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌పై పట్టుబిగిస్తోంది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినా సఫారీ జట్టు నిలకడగా ఆడుతోంది. జస్ప్రీత్ బుమ్రా స్వల్ప వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి మంచి ఊపు మీదున్న భారత్‌కు ఏబీ డివిలియర్స్ రూపంలో బ్రేక్ పడింది.
తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే పెవిలియన్‌కు చేరిన ఏబీ.. రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడి అర్ధ శతకం బాదాడు. మాత్రం మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ ఓపెనర్ డీన్ ఎల్గర్‌తో కలసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. దీంతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం భారత్‌పై దక్షిణాఫ్రికా 118 పరుగుల ఆధిక్యంలో ఉంది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ (153) అద్భుతంగా ఆడటంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. కోహ్లీ ఔట్‌తోనే భారత ఇన్నింగ్స్ ముగిసింది. వెంటనే రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన దక్షిణాఫ్రికాకు జస్ప్రీత్ బుమ్రా ఆదిలోనే షాకిచ్చాడు. తన తొలి ఓవర్లోనే ఓపెనర్ ఐడెన్ మాక్రమ్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దీంతో ఒక్క పరుగుకే సఫారీ జట్టు తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరవాత ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో బుమ్రా వేసిన చక్కటి బంతికి హషీం ఆమ్లా ఔటయ్యాడు. వికెట్ల ముందు దొరికిపోయి పెవిలియన్‌కు చేరాడు. దీంతో దక్షిణాఫ్రికా మూడు పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
మధ్యలో కాసేపు ఆటకు వర్షం ఆటంకం కలిగించింది. ఆ తరవాత మళ్లీ ప్రారంభమైన భారత బౌలర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. 78 బంతులాడిన డివిలియర్స్ 50 పరుగులు పూర్తిచేశాడు. మరోవైపు డీన్ ఎల్గర్ 78 బంతుల్లో 36 పరుగులు చేసి డివిలియర్స్‌కు మంచి సహకారాన్ని అందించాడు. వెలుతు మందగించడంతో ఆటను అంపైర్లు ముందుగానే ఆపేశారు. ఇంకా 27 ఓవర్ల ఆట మిగిలున్నప్పటికీ వెలుతురు సరిగా లేకపోవడంతో ఆపేశారు. ఇంకా రెండు రోజుల టైం ఉండటంతో ఫలితం కనిపించేలా ఉంది.