ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా ఈరోజు జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌కి వరణుడు అడ్డంకిగా మారారు. టాస్ గెలిచిన టీమిండియా సారథి విరాట్ కోహ్లి ప్రత్యర్థి జట్టును మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బ్యాటింగ్ ప్రారంభించిన ఆసిస్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారీ స్కోరు దిశగా వెల్తోంది. అయితే వర్షం వచ్చే సమయానికి ఆస్ట్రేలియా 16.1 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసింది. కెప్టెన్ ఫించ్, క్రిస్ లిన్, మ్యాక్స్‌వెల్, స్టాయినిస్ భారీ షాట్లతో దడ పుట్టించారు. ఫించ్ 20 బంతుల్లో 27, లిన్ 20 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటవగా.. మ్యాక్స్‌వెల్, స్టాయినిస్ ఇంకా క్రీజులో ఉన్నారు. మ్యాక్స్‌వెల్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పటికే కేవలం 23 బంతుల్లో 46 పరుగులు చేశాడు. మరోవైపు స్టాయినిస్ 18 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌లతో బ్యాటింగ్ దుర్బేధ్యంగా ఉంది. అటు ఆసీస్ కూడా ఈ మ్యాచ్‌లో శక్తిమేర పోరాడాలని ఆరాటపడుతోంది. టీమిండియా బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ ఒక్కడే రాణించాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 24 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. భువనేశ్వర్ కూడా 3 ఓవర్లు వేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మరో స్పిన్నర్ కృనాల్ పాండ్యాను ఆసీస్ బ్యాట్స్‌మెన్ లక్ష్యంగా చేసుకున్నారు.