ఐపీఎల్ 2024లో భాగంగా కీలక సమరం ప్రారంభమైంది. ఇవాళ తొలి క్వాలిఫయర్‌లో కోల్ కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్లనుండగా ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో తలపడాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో రెండో క్వాలిఫైయర్‌లో తలపడి ఫైనల్‌కు చేరాల్సి ఉంటుంది.
మోతేరా స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇటు సన్‌రైజర్స్ ఓపెనింగ్ జోడి బలంగా ఉండగా అటు కోల్ కతా ఓపెనర్స్ కూడా భీకర ఫామ్‌లో ఉన్నారు. కేకేఆర్ టాప్ స్కోరర్ నరైన్ (461) పై మరోసారి భారీ ఆశలే పెట్టుకుంది. దీనికి తోడు వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా మెరుపులు మెరిపిస్తే హైదరాబాద్‌కు ఇబ్బందులు తప్పవు.
హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్ (533 పరుగులు), అభిషేక్ శర్మ (467) పరుగులు చేసి భీకర ఫామ్‌లో ఉండగా వీరిద్దరూ మరోసారి రాణిస్తే ఎస్‌ఆర్‌హెచ్ విజయం తథ్యం. పంజాబ్‌తో మ్యాచ్‌లో క్లాసెన్ ఫామ్‌లోకి రావడం హైదరాబాద్‌కు కలిసివచ్చే అంశం. గత 12 మ్యాచ్‌లలో ఇక్కడ 200+ స్కోర్లు నమోదైంది రెండు సార్లే. రెండో సారి బ్యాటింగ్ చేసే జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
జట్లు (అంచనా):
కోల్ కతా: నరైన్, గుర్బాజ్, శ్రేయస్ (కెప్టెన్), వెంకటేశ్, నితీశ్, రింకూ, రస్సెల్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్, చక్రవర్తి
హైదరాబాద్: హెడ్, అభిషేక్, త్రిపాఠి, నితీశ్, క్లాసెన్, షాబాజ్, సమద్, సన్వీర్, కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్, నటరాజన్