ప్రేయసిని పెళ్లాడిన వరుణ్‌ చక్రవర్తి

ఐపీఎల్‌ 13 వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓ ఇంటివాడయ్యాడు. చాలాకాలంగా నేహా ఖడేఖర్‌తో ప్రేమాయణం నడుపుతున్న వరుణ్ శనివారం పెద్దల సమక్షంలో ఆమెను వివాహమాడాడు. సోషల్‌ మీడియా వేదికగా పలువురు క్రికెటర్లు వరుణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కేకేఆర్‌ ఫ్రాంచైజీ వరుణ్‌ చక్రవర్తికి వినూత్న రీతిలో వెడ్డింగ్‌ విషెస్‌ తెలియజేసింది. రిసెప్షన్‌ సందర్భంగా దంపతులిద్దరితో కేకేఆర్‌ ఆటగాళ్లు క్రికెట్‌ ఆడించారు. వరుణ్ బంతి విసరగా… అతని భార్య నేహా బ్యాటింగ్‌ చేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది.

కాగా, ఐపీఎల్‌ 2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరపున బరిలోకి దిగిన వరుణ్‌ చక్రవర్తి మంచి ప్రదర్శన కనబర్చాడు. సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన అతను 6.84 ఎకానమీతో 17 వికెట్లు సాధించాడు. ఐపీఎల్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన వరుణ్‌ చక్రవర్తికి టీమిండియా సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌కి తొలుత వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు.. అనూహ్యంగా అతను గాయపడడంతో అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్‌‌కు అవకాశం దక్కింది.