కోట్లాది మంది దేవతగా , అమ్మగా కొలుచుకునే వ్యక్తి మరణానికి సంబంధించిన విషయం లో మీడియా అత్యుత్సాహం చాలా ఓవర్ గా అనిపించింది. అందరికంటే ముందరే తాము ఆమె చావు వార్త ఇవ్వాలనో , మరణ అంచున ఉన్న వార్త చెప్పాలి అనో ప్రతీ న్యూస్ ఛానల్ నానా హడావిడీ చేసింది.
పోటీ తత్వం ఎక్కువవైపోవడం వలన వచ్చే దరిద్రాలు ఇవే కాబోలు. ఆమె మరణ వార్త ప్రసారం చేసి ఆ తరవాత అర్రెర్రే అని నాలుక కరచుకున్న వైనం అమ్మ ఎపిసోడ్ లో చాలా వరకూ జరిగింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ వెయిట్ చేసి.. సాయంత్ర వేళ అత్యుత్సాహంతో అమ్మ మరణించినట్లుగా కొన్ని తమిళ ఛానళ్లు వార్తలు ఇచ్చేశాయి. అంతే.. అది నిజమా? అబద్ధమా అన్న విషయాన్ని చెక్ చేయటం కనీస పాత్రికేయ ధర్మమన్నది మర్చిపోయి.. ఎవరికి తోచినట్లుగా వారు చనిపోయినట్లుగా వార్తలు వేసేయటం కనిపిస్తుంది.
అయితే.. అమ్మ మరణించలేదన్న విషయాన్ని అపోలో ఆసుపత్రులు ఎప్పటికప్పుడు స్పష్టం చేయటంతో.. నాలుక కరుచుకున్న‘మీడియా’ వెనక్కి తగ్గిన వైనం కనిపిస్తుంది. ఇలా అమ్మ అనారోగ్యం ఎపిసోడ్ లో ఆమె చనిపోయారన్న వార్తలు ఒకట్రెండుసార్ల కంటే ఎక్కువగా రావటం మర్చిపోలేం. మీడియా.. తన అత్యుత్సాహంతో కోట్లాది మంది ఆరాధించే వ్యక్తిని సంచలన వార్త కోసం చంపేసిన వైనం చూసినప్పుడు.. అమ్మపై ‘మీడియా’ హత్యాయత్నం చేసిందన్నభావన కలగటం ఖాయం.