బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్(67) ఇక లేరు. ముంబైలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో ఆయన మరణించారు. ఈ మరణ వార్త విన్న వెంటనే రిషీజీ స్నేహితుడు.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. రిషీ కపూర్ కొద్దిసేపటి క్రితమే మరణించారు. హి ఈజ్ గాన్..! రిషీ కపూర్ .. గాన్.. జస్ట్ పాస్ డ్ అవే.. ఐ యామ్ డిస్ట్రాయ్డ్! అంటూ అమితాబ్ జీ తీవ్రకలతకు గురయ్యారు.
ఇక రిషి కపూర్ ఆరోగ్యంపై ఇటీవల రకరకాల వార్తలు వచ్చాయి. 67 ఏళ్ల ఈ నటుడు క్యాన్సర్ కి చికిత్స పొందుతున్నారు. ఆ క్రమంలోనే పలుమార్లు తీవ్ర అస్వస్థతతో ముంబై రిలయన్స్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు మరోసారి సమస్య తీవ్రమవ్వడంతో బుధవారం రాత్రి ముంబైలోని ఆసుపత్రికి తరలించామని అతని సోదరుడు రణధీర్ కపూర్ చెప్పారు. తన తండ్రి ఆసుపత్రిలో చేరడంతో హీరో రణబీర్ కపూర్ బుధవారం రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. రిషికపూర్ కు 2018లో కేన్సర్ రావడంతో న్యూయార్క్ లో చికిత్స పొందారు.
అనంతరం ఆరోగ్య సమస్యలు పదే పదే తిరగబెడుతూనే ఉన్నాయన్న సమచారం ఉంది. అయితే రిషీజీ ఆరోగ్యంగా ఉన్నారని చెబుతూనే ఆకస్మికంగా మరణించడం అభిమానుల్ని కలచి వేస్తోంది. రిషి మరణ వార్తతో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. భారత చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.