సినిమాహ‌ల్ల‌లో జాతీయ‌గీతంపై సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు….

సినిమా థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించడం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పలు సూచనలు పరిగణలోకి తీసుకొని సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతం ప్రదర్శించాలని, ఆ సమయంలో ప్రేక్షకులు లేచి నిలబడానికి గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవరించింది.

ఇందులో భాగంగా కేంద్రం కొన్ని సవరణలు చేసిన నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది. 12 మంది సభ్యులతో కూడిన బృందం ఈ నివేదికను రూపొందించి కొన్ని సూచలను చేసినట్లు అటార్నీ జనరల్‌ కెకె.వేణుగోపాల్‌ తెలిపారు. జాతీయగీతాన్ని ప్రదర్శించడం అనేది థియేటర్ల యజమానులపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ జాతీయగీతం ప్రదర్శిస్తే నిలబడకుండా ఉండేందుకు దివ్యాంగులకు ఇచ్చిన మినహాయింపులో ఎటువంటి మార్పులు ఉండబోవని న్యాయస్థానం వెల్లడించింది.

అన్ని సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని ఆలపించాలని, ఆ సమయంలో ప్రేక్షకులు నిలబడి దేశభక్తిని చాటాలని 2016 నవంబరు 30న సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులకు మార్పులు అవసరమనే అభిప్రాయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గత అక్టోబరులో అభిప్రాయపడింది. ఒకే వేళ ఈ నిబంధన ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే, తొలుత పార్లమెంటులో దాన్ని ఆమోదించాలని సూచించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.