దగ్గుబాటి పురంధేశ్వరికి కాలం కాలిసి రావడం లేదు. కాంగ్రెస్‌కు గడ్డుకాలం కావడంతో గత ఎన్నికలకు ముందు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు చూస్తే.. బీజేపీ కంటే కాంగ్రెస్ పరిస్థితే బాగుంది. ఇప్పుడు మళ్లీ వెనక్కు వెళ్లాలా.. లేక బీజేపీలోనే ఉండిపోవాలా.. అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారీ చిన్నమ్మ. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగి కేంద్రమంత్రిగా 2006 నుంచి 2014 వరకూ పురంధేశ్వరి కొనసాగారు. తర్వాత.. తెలంగాణ ఉద్యమం ఉదృతమవ్వడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఆంధ్రలోని కాంగ్రెస్ దిగ్గజాలంతా బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. అలాంటి సమయంలోనూ పురంధేశ్వరి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయమే సరైనదనే రీతిలో మాట్లాడ్డం, వ్యవహరించడం చేశారు.
కానీ.. పరిస్థితి మరీ శృతిమించుతోందనే విషయం ఆలస్యంగా గుర్తించి.. కాంగ్రెస్ పార్టీని వీడి.. సరిగ్గా 2014 ఎన్నికలకు ఒక్క నెల ముందు.. మార్చిలో బీజేపీలోనికి దూకేశారు. అప్పటికి ఉన్న పరిస్థితులను బట్టి పురంధేశ్వరికి మరో ఆప్సన్ కూడా లేదు. ముందే ఎంపీ టిక్కెట్ ఇవ్వాలనే ఒప్పందంతోనే బీజేపీలో చేరడంతో కడప జిల్లా రాజంపేట నుంచి ఎంపీగా బరిలోనికి దిగారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండడంతో.. ఆ ఎన్నికల్లో పరువు దక్కించుకున్నా.. లక్షా ఎనభై వేల పైచిలుకు ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి పి.వి.మిథున్‌రెడ్డి చేతిలో పురంధేశ్వరి దారుణంగా ఓటమి పాలయ్యారు. అయితే.. కాంగ్రెస్‌ను గత ఎన్నికల్లో ఆంధ్రలో పాతాళంలో పడేసి కప్పెట్టేయడంతో.. పురంధేశ్వరి ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయం సైరందయ్యింది. కాంగ్రెస్‌లో ఉండుంటే.. ఇంతకంటే దారుణమైన ఫలితాలు వచ్చి ఉండేవి. పోనీలే.. గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్నారు. 2015లో పుంధేశ్వరిని బీజేపీ మహిళా మోర్చ ఇన్‌ఛార్చిగా నియమిస్తూ.. అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. పోనీలే.. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉండడంతో ఈ పదవితో ఐదేళ్లు గడిస్తే మళ్లీ బీజేపీ నుంచి చక్రం తిప్పి 2019 ఎన్నికల్లో పార్లమెంట్‌లోనికి అడుగుపెట్టొచ్చని పురంధేశ్వరి భావించారు.
అయితే.. ఆమె ఆశలపై నీళ్లు జల్లేలా.. బీజేపీ, తెలుగుదేశం మధ్య తాజాగా గొడవలొచ్చాయి. పైగా.. రాష్ట్రానికి గతంలో కాంగ్రెస్ ఎంత అన్యాయం చేసిందో.. మోదీ సర్కారు అంతకుమించి మోసం చేసిందనే భావన సామాన్యుల్లోనూ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఎలా చూసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానం కూడా గెలిచే పరిస్థితి రాష్ట్రంలో లేదు. పైగా కేంద్రంలోనూ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మోడీ హడావుడి కంటే.. రాహుల్ కూల్‌నెస్ మంచిదనే భావన అందరిలోనూ వచ్చింది. ఎన్నికల నాటికి ఇది మరింత ఉదృతం అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు బీజేపీలో ఉండాలా.. లేక మళ్లీ తన సొంతగూటికి చేరిపోవాలో తెలియక పురంధేశ్వరి అయోమయానికి గురవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ వెళ్లిపోయిన సీనియర్లందరినీ మళ్లీ పార్టీలోనికి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రెండు రోజుల కిందట మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా వచ్చి చేరిపోయారు. ఒకవేళ మళ్లీ కాంగ్రెస్లోనికి వెళితే.. వచ్చేసారి రాష్ర్టంలో కాకపోయినా.. కేంద్రంలో మోడీ పాపులారిటీతో మరోసారి బీజేపీ అధికారంలోనికి వస్తే.. మళ్లీ రెంటికి చెడ్డ రేవడిలా మారతానేమో అనే భయం కూడా పుంధేశ్వరిని వెంటాడతోంది. అసలే తాను తీసుకున్న నిర్ణయాలు.. గత కొంతకాలంగా ఫలించడం లేదు. ఇప్పుడు మళ్లీ పార్టీ మారితే.. పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన ఆమెను తొలిచేస్తోంది. పైగా ఎన్టీఆర్ కుమార్తెగా.. పురంధేశ్వరికి రాష్ర్టంలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇలా పార్టీలను మారుతూ ఉంటే.. అదికాస్త పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. ఏదేమైనా ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల తర్వాత తీసుకున్నా.. ఫలితం ఉండదు.