2007 ఆగస్టు 25న లుంబినీ పార్క్, గోకుల్ చాట్లో ఉగ్రవాదులు జరిపిన జంట పేలుళ్లలో 44 మంది మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసుపై నేడు తుది తీర్పు వెలవడనుంది. నాంపల్లి రెండో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు 11 ఏళ్ల తర్వాత ఈ తీర్పును వెలువరించనుంది.
ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సిట్ తేల్చింది.. అనీక్ షఫీక్, ఇస్మాయిల్ చౌదరి, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, మహ్మద్ తారీఖ్, షప్రుద్దీన్, మహ్మద్ షేక్, అమీర్ రజాఖాన్లను నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీటు తయారు చేసింది. వీరిలో ఐదుగురిని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలులో ఉంచారు.
నిందితులను ఆగస్టు 27న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టులో దర్యాప్తు అధికారులు ప్రవేశపెట్టారు. అయితే ఆధారాలను విశ్లేషించడానికి సమయం పడుతుందని పేర్కొంటూ కోర్టు సెప్టెంబర్ 4కి తీర్పును వాయిదా వేసింది. హైదరాబాద్లో ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ పేలుడుకు పాల్పడ్డ మొదటి ఘటన ఇదే. ఈ కేసులను మొదట ‘సిట్’ ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటైన అక్టోపస్ ఈ కేసు విచారణను నిర్వహించింది.
పదకొండేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి కోర్టు ఈ నెల 27నే తుది తీర్పు వెలువరించాల్సి ఉన్నప్పటికీ, న్యాయమూర్తి చివరి నిమిషంలో తీర్పును సెప్టెంబర్ 4కి వాయిదా వేశారు. తీర్పు నేపథ్యంలో హైదరాబాద్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నాంపల్లి కోర్టు, పాతబస్తీ ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు రియాజ్భత్కల్, ఇక్బాల్ భత్కల్, అమీరజాఖాన్లు పరారీలో ఉన్నారు.తీర్పు నేపథ్యంలో హైదరాబాద్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నాంపల్లి కోర్టు, పాతబస్తీ ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.