ఆసిస్‌తో సిడ్నీలో జరుతున్న నాలుగో టెస్ట్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. నాలుగో టెస్టులో ఇక ప్రత్యర్థి జట్టును రెండుసార్లు ఆలౌట్ చేయడమే భారత బౌలర్ల ముందున్న లక్ష్యం. బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. పుజారా (193), రిషబ్ పంత్ (159 నాటౌట్), జడేజా (81), మయాంక్ అగర్వాల్ (77) సత్తా చాటడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 622 పరుగులు చేసింది. భారీ స్కోరు సాధించడంతో 622/7 వద్ద కెప్టెన్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.
ఆసిస్ గడ్డపై చరిత్ర సృష్టించేందుకు ఒకడుగు దూరంలో నిలిచింది టీమిండియా. ఇక భారం అంతా బౌలర్ల చేతుల్లో ఉంది. 303/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు శుక్రవారం ఆట ప్రారంభించిన భారత్ మరో 3 వికెట్లు కోల్పోయి 319 పరుగులు జోడించింది. రిషబ్ పంత్ సెంచరీ, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు సాధించారు.
పుజారా ఔటైనా భారత జట్టు స్కోర్ వేగం మాత్రం తగ్గలేదు. రిషభ్ పంత్, రవీంద్ర జడేజా స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించారు. 7వ వికెట్‌కు 204 పరుగులు జోడించి భారత్ జట్టు స్కోర్ 600 పరుగుల మార్క్ దాటడంలో కీలక పాత్ర పోషించారు. రిషభ్ పంత్ టెస్ట్‌ల్లో రెండో సెంచరీ నమోదు చేయగా….జడేజా 10వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 114 బంతుల్లో 81 పరుగులు చేసిన జడేజా ఔటయ్యాక టీమిండియా కెప్టెన్ విరాట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు