- Advertisement -

వైజాగ్‌తో నాది విడదీయరాని బంధం: అల్లు అర్జున్

- Advertisement -

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖపట్నంతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. వైజాగ్‌లోని నూతన ఇనార్బిట్ మాల్‌లో అత్యంత ఆధునిక సాంకేతికతతో నిర్మించిన ‘ఏఏఏ సినిమాస్‌’ (AAA Cinemas) థియేటర్లను ఆయన ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాఖ సమీపంలో ఇటీవల ప్రధాని చేతుల మీదుగా కొత్త ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కావడం ఎంతో సంతోషకరమని అల్లు అర్జున్ పేర్కొన్నారు. వైజాగ్‌తో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని, ఈ నగరం అభివృద్ధి చెందుతుండటం చూస్తుంటే ఆనందంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ ప్రారంభోత్సవ వేడుకలో అల్లు అర్జున్ తన గతాన్ని నెరుకువకు తెచ్చుకున్నారు. ‘‘గంగోత్రి సినిమా షూటింగ్ సమయంలో నేను ఇదే వైజాగ్‌ రోడ్లపై నడిచేవాడిని. అప్పట్లో నన్నెవరూ అసలు గుర్తు కూడా పట్టేవాళ్లు కాదు. కానీ నేడు అదే రోడ్డులో నేను సాధారణంగా నడవలేని పరిస్థితి వచ్చింది’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. వైజాగ్‌కు ఎప్పుడు వచ్చినా తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూనే ఉంటానని, విశాఖ నగరమంటే తనకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమని మనసులోని మాటను బయటపెట్టారు. ఇంతటి సుందరమైన నగరంలోకి ఇంతపెద్ద ఇనార్బిట్ మాల్ రావడం విశేషమని కొనియాడారు.

సినిమా థియేటర్ల ప్రత్యేకత గురించి బన్నీ మాట్లాడుతూ.. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యాధునిక ‘వైల్డ్ ఫైర్ టెక్నాలజీ’ (Wild Fire Technology)తో కూడిన స్పెషల్ స్క్రీన్‌ను ‘ఏఏఏ సినిమాస్‌’లో అందుబాటులోకి తీసుకురావడం వ్యక్తిగతంగా తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమా అనుభూతిని పంచేందుకే ఈ సాంకేతికతను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ అత్యాధునిక హంగులతో కూడిన థియేటర్ విశాఖ సినీ ప్రియులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా థియేటర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తన ఐకానిక్ ‘పుష్ప’ గెటప్ విగ్రహాన్ని అల్లు అర్జున్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడకు వచ్చిన వందలాది మంది అభిమానులతో కలిసి ఆ విగ్రహం వద్ద సెల్ఫీలు దిగి సందడి చేశారు. ఈ వేడుకలో ప్రముఖ సినీ నిర్మాతలు అల్లు అరవింద్, నటుడు సునీల్, అలాగే స్థానిక ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజు తదితరులు ప్రత్యేక అతిథులుగా హాజరై సందడి చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -