Thursday, May 2, 2024
- Advertisement -

‘మహానటి’కి మకిలి అంటించిన చంద్రబాబు

- Advertisement -

జీవితంలో ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా ప్రత్యర్థుల సక్సెస్‌ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అలాగే ఫెయిల్యూర్ బాధ మరీ ఎక్కువగా బాధిస్తూ ఉంటే అవతలివాళ్ళ సక్సెస్‌ని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి శతధా ప్రయత్నిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మరీ అతి చేస్తూ ఉంటాడు. మొన్నటి వరకూ సాఫ్ట్ వేర్‌ని తానే కనిపెట్టా అనే రేంజ్‌లో సాఫ్ట్ వేర్ క్రెడిట్ అంతా కొట్టేయాలని చూశాడు. ఇక తెలంగాణా విభజన నాలుగేళ్ళ తర్వాత తెలంగాణా విద్యార్థి ఒకరు ఐఎఎస్ టాపర్ అయ్యారు. అది కూడా తన ఘనతే అని చెప్పుకున్నాడు చంద్రబాబు. ఇక బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ ఖ్యాతిని కూడా తన ఖాతాలో వేసుకోవాలని చూడడం చంద్రబాబు అతికి పరాకాష్ట.

ఆ మధ్య బాహుబలి సక్సెస్‌ని కూడా తన అకౌంట్‌లో వేసుకోవాలని చూసిన చంద్రబాబు తాజాగా మహానటి సక్సెస్‌ని, సావిత్రి ఖ్యాతిని కూడా తన స్వార్థం కోసం ఉపయోగపెట్టుకోవాలని చూశాడు. అధికారికంగా టిడిపిి పార్టీనే అయిన అశ్వినీదత్ కూడా బాబు రాజకీయాలకు మరోసారి జై కొట్టాడు. అయితే ఈ సన్మానం సందర్భంగా సావిత్రి కూడా చంద్రబాబు నాయుడి సొంత కులానికి చెందిన వ్యక్తే అని చెప్పి టిడిపి నాయకులు, బాబు వందిమాగధులు చర్చించుకోవడం మాత్రం జుగుప్సాకరం అనిపించింది. సినిమాలో సావిత్రి చౌదరి వాళ్ళ అమ్మాయి అనేలా వ్యక్తీకరించడం కూడా సావిత్రి అభిమానులకు నచ్చలేదు. నిజానికి సావిత్రి చౌదరిల అమ్మాయి కాదు. అన్నింటికీ మించి కులం పేరు చెప్పుకున్న వ్యక్తి అస్సలు కాదు. అలాంటి మహానటిని ఇప్పుడు ఒక కులానికి పరిమితం చేయాలనుకోవడం ఆ మహానటికి మకిలి అంటించడమే. తిరుమల వెంకన్న స్వామి నుంచి అందరినీ కూడా మన కులం వాడే అని చెప్పుకోవడంలో టిడిపి నేతలకు ఉన్న తృప్తి ఏంటో తెలియదు కానీ ఈ కులభావనల కంపును మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అస్సలు భరించలేకపోతున్నారన్నది నిజం.

ఇక మహానటి సన్మాన కార్యక్రమం సందర్భంగా మహానటి సినిమాకు ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నానని ఆర్భాటంగా ప్రకటించాడు చంద్రబాబు. అయితే ఎవడే సుబ్రమణ్యం సినిమాతోనే తన సెన్సిబిలిటీస్ ఏంటో ప్రూవ్ చేసుకున్న నాగ్ అశ్విన్………సినిమాలో సావిత్రి దాతృత్వాన్ని, దాన గుణాన్ని గొప్పగా చూపించినట్టుగానే నిజ జీవితంలో తాను కూడా అంతే గొప్పగా ప్రవర్తించాడు. వేల కోట్లు సంపాదన తెచ్చిపెట్టిన బాహుబలి సినిమా జనాలు కూడా ట్యాక్స్ మినహాయింపుల కోసం ఎగబడితే………నాగ్ అశ్విన్ మాత్రం ట్యాక్స్ మినహాయింపు వద్దని చెప్పి పిల్లనిచ్చిన మామ అయిన అశ్వినీదత్ చేత చంద్రబాబుకు చెప్పించాడు. ఆ రకంగా తన వ్యక్తిగత స్వార్థం, తన మనుషులు అయినవారికి అసలే అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఖజనా నుంచి అప్పనంగా పంపకాలు చేస్తున్న చంద్రబాబు మార్క్ అక్రమాలకు చెక్ చెప్పాడు నాగ్ అశ్విన్. తాను కమర్షియల్‌గా కరప్ట్ అయిన సినిమా డైరెక్టర్‌ని కానని ససాక్ష్యంగా నిరూపించుకున్నాడు నాగ్ అశ్విన్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -