బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా, ఆయన భార్య సునీతా అహుజా మధ్య గత కొంతకాలంగా నెలకొన్న వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. నూతన నటి కోమల్ రాణి స్వర్ణకార్‌తో గోవిందా సన్నిహితంగా మెలుగుతున్నట్లు వస్తున్న వార్తలపై సునీత తీవ్రంగా స్పందించారు. ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్న చందంగా గోవిందా మతి చెడి ప్రవర్తిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇటీవల ఓ ఎయిర్‌పోర్టులో గోవిందా, కోమల్ రాణి కలిసి వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది.
గతంలోనూ గోవిందాతో ఇతర నటీమణులకు సంబంధాలున్నాయని తాను బహిరంగంగా చెప్పినప్పుడు అభిమానులు తనను తీవ్రంగా ట్రోల్ చేశారని సునీత గుర్తుచేశారు. ఇప్పుడు అదే విషయాలు నిజమవుతున్న నేపథ్యంలో ఆనాటి ట్రోలర్లు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. ఈ వివాదంపై ఇక ముందు తనను ఎలాంటి ప్రశ్నలు అడవద్దని, దీనిపై మాట్లాడేందుకు తనకు ఎలాంటి ఆసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు.
మరోవైపు సునీత గతంలో చేసిన వ్యాఖ్యలపై హీరో గోవిందా ఇటీవల స్పందించిన సంగతి తెలిసిందే. తనపై ఉన్న అమితమైన ప్రేమతోనే ఆమె తనను తిడుతుంటానని, ఆ తిట్లను కూడా తాను ప్రేమగానే భావిస్తానని ఆయన తెలిపారు. తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక సునీత శ్రమ ఎంతో ఉందని, పిల్లలను ఎంతో బాధ్యతగా, ప్రేమగా పెంచి పెద్ద చేసిందని గోవిందా గతంలో ప్రశంసించారు.
‘కూలీ నెం:1’, ‘ఆంఖే’, ‘హీరో నెం:1’, ‘రాజాబాబు’, ‘బడేమియా ఛోటేమియా’, ‘సజన్ చలే ససుర’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలతో కామెడీ, డాన్స్‌లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు గోవిందా. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎంపీగానూ విజయం సాధించారు. కాగా, సునీతా అహుజాను 1987లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. దశాబ్దాలుగా అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో తాజాగా వచ్చిన ఈ విభేదాలు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
