ప్రపంచానికి తన గురించి తెలియని కొత్త కోణాన్ని వివరించాడు జగపతి బాబు. ఈ ఫ్యామిలీ హీరో ఈ మధ్య విలన్ వేషాలు వేస్తూ వస్తున్నాడు.
అంతకు ముందు వరకూ జగపతికి రొమాంటిక్ హీరోగా గుర్తింపు ఉంది. కేవలం స్క్రీన్ మీద మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోకూడా జగపతికి రొమాంటిక్ టచ్ ఉందని మీడియాలో గాసిప్స్ వినిపించేవి.
అయితే అదంతా గతం అనుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు జగపతి బాబు తనలోని కొత్త యాంగిల్ ను పరిచయం చేశాడు. తనకు తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ మీద ఆసక్తి పెరిగిందని జగపతి చెప్పుకొచ్చాడు. ప్రత్యేకించి ‘లింగా’ సినిమా సమయంలో ఈ ఆసక్తి మొదలైందని.. అప్పటికే దీంట్లో పండిపోయిన రజనీకాంత్ వంటి వారి సాంగత్యం మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని.. ధ్యానం, తత్వంలపై మరింత ఆసక్తి పెంచిందని జగపతిచెబుతున్నాడు.
లింగా సినిమాలో జగపతి విలన్ గా నటించిన విషయం తెలిసిందే. దీనికన్నా ముందే కథానాయకుడు సినిమాలో కూడా రజనీతో కలిసి నటించిన జగపతికి ఈ సినిమాతో సూపర్ స్టార్ తో మరింత సాన్నిహిత్యం పెరిగిందట. ఈ సందర్భంగా రజనీ చేత మంచి పుస్తకాలు ఇప్పటించుకొని చదివాడట జగపతి. ఇదే సమయంలో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుష్కతో కూడా తత్వ చర్చలు చేశాడట జగపతి. ఆమె కూడా పుస్తకాలు బాగా చదువుతుందని.. తనకు కూడా ఆ పుస్తకాలను ఇచ్చిందని జగపతి చెప్పాడు. తను ఆ పుస్తకాలను ఏకబిగిన చదివేశానని.. ఈ అధ్యాత్మిక రూటు బాగుందని. మంచి అనుభూతిని ఇస్తోందని జగపతి బాబు చెప్పాడు.