సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న పవర్ఫుల్ చిత్రం ‘ధురంధర్’ (Dhurandhar). ఈ సినిమాపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించగా.. తాజాగా దీని జాబితాలోకి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేరిపోయారు. ఇటీవల ఒక ప్రముఖ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘ధురంధర్’ తో పాటు బాలీవుడ్ హారర్ చిత్రం ‘బారాముల్లా’ (Baramullah) సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
‘ధురంధర్’ మొదటి భాగం తనకు ఎంతగానో నచ్చిందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. దర్శకుడు కథను చాలా ధైర్యంగా, ఎక్కడా రాజీ పడకుండా చూపించిన విధానం తనను ఆకట్టుకుందన్నారు. ముఖ్యంగా సినిమా మేకింగ్ స్టైల్ చాలా బాగుందని ప్రశంసించారు. అయితే తన రాజకీయ, వ్యక్తిగత పనుల వల్ల విపరీతమైన బిజీగా ఉండడం కారణంగా.. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ‘ధురంధర్ 2’ సినిమాను తాను ఇంకా చూడలేకపోయినట్లు పవన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇక తనకు పర్సనల్‌గా హారర్ జానర్ సినిమాలంటే చాలా ఇష్టమని పవన్ కల్యాణ్ చెప్పారు. హారర్ సినిమాలు మన మనసును కథలో పూర్తిగా లీనం చేస్తాయని.. తనకు రాత్రి పూట నిద్ర రానప్పుడు ఏదైనా మంచి హారర్ సినిమా చూస్తుంటానని తెలిపారు. కశ్మీర్ ఉగ్రవాదం, భయానక వాతావరణం నేపథ్యంలో తెరకెక్కిన ‘బారాముల్లా’ సినిమా తనకు పాత జ్ఞాపకాలను గుర్తుచేసిందని పవన్ ఎమోషనల్ అయ్యారు.
తాను 1987 నుండి 1989 కాలంలో షూటింగ్‌ల నిమిత్తం కశ్మీర్ వెళ్తుండేవాడినని.. అప్పట్లో అక్కడ జరిగిన గందరగోళ పరిస్థితులను, కశ్మీరీ పండిట్లు అనుభవించిన నరకయాతనను, బాధలను స్వయంగా గమనించానని చెప్పారు. ఎవరైనా ఒక వ్యక్తిని తన సొంత స్థలం నుండి ‘గెటవుట్.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అని బలవంతంగా తరిమేస్తుంటే తనకు అస్సలు నచ్చదని.. ఆ బాధను భరించడం చాలా కష్టమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. బహుశా ‘బారాముల్లా’ సినిమాలో చూపించిన ఆ నిజాయితీ గల మానవీయ భావోద్వేగమే తనకు ఆ సినిమా అంతగా నచ్చేలా చేసి ఉంటుందని పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
