ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన ‘మెగా డీఎస్సీ’ ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు, అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే కేంద్రీయ దర్యాప్తు సంస్థ (CBI) చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
మీడియాతో మాట్లాడిన జగన్.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన వాస్తవాలు అత్యంత దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేసిందని, ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీసిందని జగన్ మండిపడ్డారు. దేశంలో ఎక్కడా ఇలాంటి దారుణమైన నియామక ప్రక్రియ జరగలేదని దుయ్యబట్టారు. అబద్ధాలు, మోసం, దగా, వెన్నుపోటు, స్కామ్‌లకు ప్యాంటు, షర్టు వేస్తే ఆయనే చంద్రబాబు నాయుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
16,000 పోస్టుల భర్తీ ప్రక్రియ లీకులు, స్కామ్‌లతో నిండిపోయిందని జగన్ ఆరోపించారు. నిబంధనలను పక్కనబెట్టి డీఎస్సీ కన్వీనర్‌ను కాదని, ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారికి (SCERT డైరెక్టర్) అప్పగించడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. పరీక్షల ప్రక్రియలో పాల్గొన్న ఒక ఎస్సీఈఆర్‌టీ (SCERT) ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ విషయం బయటపడగానే అధికారిక రికార్డుల నుండి అతని డేటాను తొలగించారని ఆ ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాలను ఎప్పటిలాగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో బహిరంగంగా ప్రదర్శించకుండా, కేవలం ఎంపిక చేసిన వారికి మాత్రమే ఎస్ఎమ్ఎస్ (SMS) ల ద్వారా సమాచారం పంపడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు. స్పోర్ట్స్ కోటా కింద పోస్టులను ఒక్కొక్కటి రూ. 15 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు అధికార పార్టీకి చెందిన మధ్యవర్తులు అమ్ముకున్నారని ఆరోపించారు. అర్హత పరీక్ష రాయకపోయినా కేవలం ఏదో ఒక పోటీలో పాల్గొన్న సర్టిఫికేట్ ఉంటే చాలని జీవోలు (GOs) ఇచ్చి దాదాపు 270 మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారని, జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్ట్‌లకు మాత్రం అన్యాయం జరిగిందని జగన్ పేర్కొన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా కేవలం 4 నెలల రికార్డు కాలంలోనే 1.30 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసి చరిత్ర సృష్టించామని జగన్ గుర్తుచేశారు. ప్రస్తుత డీఎస్సీ స్కామ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా నిందితులుగా ఉన్నారని, లోకేష్ పదవిలో ఉంటే విచారణ సక్రమంగా జరగదని, కాబట్టి ఆయనను తక్షణమే మంత్రివర్గం నుండి తొలగించి నిష్పక్షపాతంగా సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం జూన్ 12న వైఎస్సార్‌సీపీ చేపట్టబోయే రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో ఈ డీఎస్సీ అక్రమాల అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతామని జగన్ స్పష్టం చేశారు.
