విజయ్ హీరోగా రూపొందిన తమిళ సినిమా ‘పులి’ బడ్జెట్ 125 కోట్ల రూపాయలు అని ఆ సినిమా యూనిట్ ఘనంగా ప్రకటించుకొంది.
ఇది దక్షిణాదిలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకొంది. మరి ఇదే సినిమా ను తెలుగులోకి కూడా డబ్ చేశారు. మరి ఇంత వరకూ విజయ్ సినిమాలేవీ తెలుగులో అంతగా ఆడిన దాఖలాలు లేవు.
ఇటీవలే వచ్చిన “జిల్లా” కూడా అంతంత మాత్రంగానే ఆడింది. ఇలాంటి నేపథ్యంలో పులి సినిమా తెలుగు హక్కులను మాత్రం భారీ రేట్లకు అమ్మారు. ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల ధరకు అమ్మారని తెలుస్తోంది. 125 కోట్ల బడ్జెట్ తో పోల్చుకొంటే ఈ ఎనిమిది కోట్ల రూపాయలు తక్కువే. కానీ తెలుగులో విజయ్ మార్కెట్ పరిమితమైనదే. కాబట్టి ఇది పెద్ద మొత్తమే అనుకోవాలి.
మరి పులి టీజర్ ఏమంత ఆకట్టుకోలేదు కూడా. ఇందులో శ్రేదవి నటించిందనే పేరున్నప్పటికీ… ఆమె లుక్స్ కూడా ఏమంత బాగోలేవు. ఇంతకు ముందే ఈ సినిమా దర్శకుడు చింబుదేవన్ “హింసించే 23 వ రాజు పులకేశి” పేరుతో ఒక సినిమాను రూపొందించాడు. అయితే అది తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇలాంటి నేపథ్యంలో ‘పులి’ ఏ మేరకు ఆకట్టుకొంటుందో చూడాలి!