ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కాలా’ టీజర్ వచ్చేసింది. తలైవా మరోసారి మాఫియా డాన్ పాత్రలో అదరగొట్టారు. “కాలా అంటే ఎవరు? కాలుడు… కరికాలుడు. గొడవపడైనా సరే కాపాడేవాడు” అన్న బ్యాక్ గ్రౌండ్ వాయిస్ డైలాగుతో పాటు ఓ మధ్యతరగతి కుటుంబ గృహిణి “గొడవేకదా? పెట్టుకుంటాడు పెట్టుకుంటాడు. ఎన్నాళ్లు ఎట్టుకుంటాడో నేనూ చూస్తా” అని వ్యంగ్యంగా అనే మాటలతో రజనీ స్వభావాన్ని చూపించే ప్రయత్నం చేశారు.
ధనుష్ వండర్ బార్ ఫిలిమ్స్ నిర్మాణంలో పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుంది. తమిళ టీజర్ ను ముందుగా రిలీజ్ చేసిన చిత్రయూనిట్ 10 గంటలకు తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. రజనీ డాన్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమాలో నానా పటేకర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. నానా నటిస్తున్న తొలి దక్షిణాది సినిమా ఇదే కావటం విశేషం.
ఆపై నానాపటేకర్ డైలాగులతో పాటు “నలుపు… శ్రమ జీవుల వర్ణం. మా వాడకొచ్చి చూడు. మురికంతా ఇంధ్రదనస్సులా కనిపిస్తుంది”, “క్యారే… సెట్టింగా? వీరయ్య బిడ్డనురా… ఒక్కడినే ఉన్నా… దిల్లుంటే గుంపుగా రండిరా” అన్న రజనీ డైలాగ్ ఈ టీజర్ లో ఉన్నాయి.
