తమిళ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శంకర్ సినిమాలు అంటేనే ఓ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. కథ, కథనం, మేకింగ్ ఇలా అన్నింట్లోనూ కొత్తదనం, భారీ తనం కనిపిస్తుంది. ఇక శంకర్‌కు సక్సెస్ రేటు కూడా చాలా ఎక్కువ. జెంటిల్మెన్, భారతీయుడు, ప్రేమికుడు, అపరిచితుడు వంటి చిత్రాలు తెలుగులోనూ సెన్సేషనల్ క్రియేట్ చేశాయంటే శంకర్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే దర్శకుడు శంకర్ సినిమాలు చాలా ఏళ్ల పాటు చిత్రీకరణ జరుపుకుంటూ ఉంటాయి. కనీసం రెండు లేదా మూడేళ్లపాటు షూటింగ్ జరుగుతూ ఉంటుంది.
ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు కూడా చాలా రోజులు తీసుకుంటారు. ఐ, రోబో, రోబో 2.0 సినిమాలు పూర్తవడానికి రెండేళ్ల సమయం పట్టింది. తాజాగా శంకర్ .. రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దిల్‌రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శంకర్ మామూలుగానే సినిమా తీయడానికి ఏళ్ళ తరబడి సమయం పడుతుంటుంది.. ఇక ఈ మూవీ పూర్తయ్యే సరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని ఫ్యాన్స్ భావించారు.
కానీ శంకర్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం ఆరు నెలల లోపే ఈ చిత్రం షూటింగ్ ముగించబోతున్నారని సమాచారం. ఇప్పటికే శంకర్ ప్రీ ప్రొడక్షన్ పనులు ఎంతో వేగంగా పూర్తిచేశాడట. స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నాడట. ఇక హీరోయిన్గా కియారా అద్వానీని ఎంపిక చేశారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్‌ను తీసుకున్నారు. తమన్ ఇప్పటికే మ్యూజిక్ కంపోజింగ్‌లో బిజీగా ఉన్నాడట. కేవలం ఆరునెలల్లోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు టాక్. శంకర్ గత చిత్రాల మాదిరే ఆలస్యం చేస్తాడా? లేక తొందరగా పూర్తి చేస్తాడా? అన్నది వేచి చూడాలి.
ఇది ఇలా ఉంటే సినిమా ప్రారంభం సందర్భంగా చిత్రయూనిట్ ఆశ్చర్యకరమైన రీతిలో ఓ ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారాలతో పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు, కీలకపాత్రధారి సునీల్, ఈ చిత్రానికి పనిచేస్తున్న టెక్నీషియన్లు అందరూ సూట్లు ధరించి దర్శనమిస్తారు. వీ ఆర్ కమింగ్ అంటూ ఈ పోస్టర్ కు క్యాప్షన్ పెట్టారు.

Also Read: మనసు మార్చుకున్నా మహేష్..