దగ్గుబాటి రానాకు హాలీవుడ్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడూ హాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతో తరచూ కనిపిస్తుంటాడు. హాలీవుడ్ సినీ వేడుకల్లో కూడా రానా మెరుస్తుంటాడు. ఇప్పుడు మరో హాలీవుడ్ అవకాశాన్ని రానా పొందాడు. మార్వెల్ స్టూడియోస్ వారి ‘ఎవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్’ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సూపర్ హీరోల అందరి కలయిక. మార్వెల్ స్టూడియోస్ పదేళ్ల ప్రస్థానానికి ‘ఎవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్’ని క్లైమాక్స్ గా చెప్పొచ్చు.
‘డిస్నీ ఇండియాస ఈ సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ‘ఎవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్’ తెలుగు వెర్షన్‌కు నటుడు రానా దగ్గుబాటి డబ్బింగ్ చెప్పాడు. ‘ఎవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్’ విలన్ తానొస్‌కు రానా డబ్బింగ్ చెప్పారు.
తానొస్‌కు రానా దగ్గుబాటి గొంతు ఇవ్వడంతో ఈ సినిమా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది అని నమ్ముతున్నాం అని డిస్నీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హెడ్ బిక్రమ్ దుగ్గల్ ప్రకటించాడు. ఇటీవల దీనికి డబ్బింగ్ చెప్పిన రానా దగ్గుబాటి ఈ విషయంపై స్పందించారు. “నేను మార్వెల్ కామిక్స్‌ని చదువుతూనే పెరిగా. సూపర్ హీరోల కథలని ఆకట్టుకునేలా, ఎన్నో భాగాలుగా చెప్పడం మార్వెల్ సినిమాల గొప్పదనం. మార్వెల్ తమ పాత్రల్ని సృష్టించడంలో కానీ వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులతో కనెక్ట్ చేయడంలో కానీ మార్వెల్ది తిరుగులేని స్థాయి. ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా నా ఫేవరెట్ కేరక్టర్స్. ‘ఎవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్’ కి డబ్బింగ్ చెప్పడం థ్రిల్లింగ్‌గా ఉంది. ఎవెంజర్స్ లాంటి సూపర్ హీరోలని సైతం ముప్పతిప్పలు పెట్టే సూపర్ విలన్ తానొస్గా వినిపించడం మరిచిపోలేని అనుభవం.. అని హర్షం వ్యక్తం చేస్తూ రానా మాట్లాడారు.
