టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ఇరుముడి’ (Irumudi). టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచి ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అభిమానులు థియేటర్ల దగ్గర పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.
సినిమాలో రవితేజ నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా హీరో రవితేజ అయ్యప్ప మాలధారణలో కనిపించే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. ఆ సీన్స్ వస్తున్న సమయంలో థియేటర్లలో ఫ్యాన్స్ గోల ఆపలేకపోతున్నారు. తెరపై ఆ దృశ్యాలు రాగానే థియేటర్లలోని స్క్రీన్లకు కొందరు హారతులు ఇస్తున్నారు. ఆ పూజలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.
అంతేకాకుండా సినిమాలో ‘మల్లెపూల పల్లకి’ అనే పాట వచ్చినప్పుడు థియేటర్ల వద్ద అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఈ పాటకు థియేటర్ స్క్రీన్ల దగ్గరకు వెళ్ళి కొందరు యువకులు డ్యాన్స్‌లు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్ఎస్ఆర్ మ్యూజిక్, పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయని ఫ్యాన్స్ అంటున్నారు. థియేటర్లలో ప్రేక్షకులు చేస్తున్న ఈ హడావిడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
శివ నిర్వాణ టేకింగ్, రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులను ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది. మొదటి రోజు కలెక్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రవితేజ కెరీర్లో ‘ఇరుముడి’ మరో మెమొరబుల్ హిట్ ఇస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.
