- Advertisement -

ఏఈ కుటుంబం ఆత్మహత్య.. మరిన్ని సంచలన విషయాలు!

- Advertisement -

కాకినాడకు చెందిన పంచాయతీరాజ్‌ ఏఈ టి.నూకరాజు కుటుంబం గోదావరి నదిలో దూకి సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్ వేధింపుల వల్లే తాము ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లు మృతులు స్పష్టమైన సూసైడ్ నోట్ రాశారు. ఆత్మహత్యకు ముందే నూకరాజు ఒక వీలునామా కూడా రాసిపెట్టారు. తమకున్న ఆస్తులను సోదరితో పాటు ముగ్గురి పేరిట రాశారు. మనవడు తమతోనే చనిపోతాడని భావించి అతడి పేరు రాయలేదని తెలుస్తోంది.

ఈ ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు సాధిక్ ఖాన్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సాధిక్ ఆచూకీ తెలిపిన వారికి తగిన రివార్డు ఇప్పిస్తామని పోలీసులు ప్రకటించారు. మరోవైపు సాధిక్ కాల్ డేటా ఆధారంగా అనుమానితులను విచారిస్తున్నారు. నూకరాజు కుటుంబ ఖాతాల నుంచి సాధిక్ అకౌంట్‌కు భారీగా డబ్బులు వెళ్లాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

ఇక నదిలో దూకడానికి ముందు సౌజన్య తన కుమారుడు కార్తికేయతో ఒక కీలక విషయం చెప్పింది. నీకు ఈత వచ్చు కాబట్టి బతికి బయటపడితే ఫలానా ఆంటీ దగ్గరికి వెళ్లు అని సూచించినట్లు చిన్నారి పోలీసులకు తెలిపాడు. ఆ మహిళ ఆరా తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె ఫోన్ పనిచేయడం లేదు. ఈ వేధింపుల గురించి రెండు నెలల క్రితమే నూకరాజు నేరుగా సాధిక్ ఇంటికి వెళ్లారు. తమ కుటుంబాన్ని వేధించడం ఆపేయాలని సాధిక్ తల్లిని వేడుకున్నారు. ఆమె కూడా కుమారుడికి సర్దిచెప్పినప్పటికీ సాధిక్ మాత్రం తన తీరు మార్చుకోలేదు.

రాజమహేంద్రవరం రోడ్డు కమ్ రైలు వంతెన పైకి కారులో వెళ్లిన ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య గోదావరిలోకి దూకారు. ఈ ప్రమాదంలో చిన్నారి కార్తికేయ ప్రాణాలతో బయటపడ్డాడు. సోమవారం సాయంత్రం ధోబీ ఘాట్ వద్ద నూకరాజు మృతదేహం లభ్యమైంది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దారుణానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -