విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాపీస్ ముందు వసూళ్ల జోరు చూపించలేకపోయింది తన్వీ ది గ్రేట్. ఆస్కార్ నామినేషన్ చర్చల నేపథ్యంలో ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాకు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించగా, శుభాంగి దత్ ప్రధాన పాత్రలో నటించారు.
2025 జూలైలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం దాదాపు ఎనిమిది నెలల తరువాత ఇప్పుడు ఓటీటీ వేదికపై అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ భాషలో హిందీ సబ్‌టైటిల్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. డిజిటల్ ప్రీమియర్ ద్వారా ఈ భావోద్వేగ దేశభక్తి కథకు మరింత విస్తృతమైన ప్రేక్షకులను చేరుకునే అవకాశం లభించింది.
ఈ దేశభక్తి నేపథ్య చిత్రంలో అరవింద్ స్వామి,ఇయాన్ గ్లెన్, బొమన్ ఇరానీ, జాకీ ష్రాఫ్, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని అనుపమ్ ఖేర్ స్టూడియోస్, NFDC సంయుక్తంగా నిర్మించాయి. సంగీతాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సమకూర్చారు.
