మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’. సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా రిలీజ్డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. తాజాగా అభిమానుల సమక్షంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ…ది రాజా సాబ్ ప్రభాస్ అభిమానులను ఏమాత్రం నిరాశపరచదని స్పష్టం చేశారు. అంతేకాదు, తనకు ఇంత భారీ అవకాశాన్ని ఇచ్చిన డార్లింగ్ ప్రభాస్ గురించి మాట్లాడే సమయంలో మారుతి భావోద్వేగానికి గురయ్యారు. మాటలు తడబడుతూ కంటతడి పెట్టిన ఆయన పరిస్థితిని గమనించిన ప్రభాస్ వెంటనే వేదికపైకి వచ్చి మారుతిని హగ్ చేసుకుని ఓదార్చారు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ సినిమా కోసం మారుతి మరియు అతని బృందం దాదాపు మూడేళ్ల పాటు అహోరాత్రులు శ్రమించారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో సినిమా తీయడం సహజంగానే మారుతిపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చిందని ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. నిర్మాత విశ్వప్రసాద్ రాజీ పడకుండా అవసరమైన బడ్జెట్‌ను సమకూర్చారు. మొదట ఈ చిత్రాన్ని ఒక చిన్న స్థాయి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాలని భావించినప్పటికీ, కథా విస్తృతి పెరగడంతో పాటు బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీగా మారాయి. చివరకు ఫైనల్ అవుట్‌పుట్‌పై పూర్తి సంతృప్తి వచ్చిన తర్వాతే విడుదల తేదీని ఖరారు చేశారు.
ఈ దశకు సినిమాను తీసుకురావడానికి మారుతి ఎన్నో ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కొన్నారు. అందుకే ప్రీ రిలీజ్ వేదికపై ఆయన తన భావోద్వేగాన్ని దాచుకోలేకపోయారు. ఇదే వేదికపై మారుతి నేరుగా ప్రభాస్ అభిమానులకు ఒక ధైర్యమైన సవాల్ విసిరారు. ఈ సినిమా మీకు నచ్చకపోతే, నా ఇంటికి వచ్చి ప్రశ్నించండి అని చెప్పారు.
