ఈ ఏడాది స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌కు గురైన తర్వాత, భారత టెస్టు జట్టు హెడ్ కోచ్ పదవికి సంబంధించి బీసీసీఐ వీవీఎస్ లక్ష్మణ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ ఇప్పటివరకు రెడ్ బాల్, వైట్ బాల్ ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లను నియమించాలనే అంశంపై అధికారికంగా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. అయినప్పటికీ, ఇటీవల కాలంలో టెస్టు క్రికెట్‌లో భారత జట్టు ప్రదర్శన తీవ్ర ఆందోళన కలిగించేలా ఉంది.
గత 12 నుంచి 14 నెలల కాలంలో భారత జట్టు వైట్ బాల్, రెడ్ బాల్ ఫార్మాట్లలో విభిన్నమైన ఫలితాలు నమోదు చేసింది. వన్డేలు, టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత్, టెస్టుల్లో మాత్రం నిరాశపరిచింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేత 3-0తో, దక్షిణాఫ్రికా చేత 2-0తో భారత్ పరాజయం పాలైంది. అలాగే ఆస్ట్రేలియాలో తొలి టెస్టు గెలిచినప్పటికీ, ఆ సిరీస్‌ను 3-1తో కోల్పోయింది. ఈ ఫలితాల నేపథ్యంలో ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్థానం టెస్టు ఫార్మాట్‌లో ప్రమాదంలో ఉందనే చర్చలు మొదలయ్యాయి.
అయితే, ప్రత్యామ్నాయ ఎంపికలు తక్కువగా ఉండటంతో బీసీసీఐకి పెద్దగా అవకాశాలు లేవని పీటీఐ నివేదిక పేర్కొంది. నవంబర్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 2-0 ఓటమి తర్వాత, క్రికెట్ బోర్డులో కీలకంగా ఉన్న ఒకరు వీవీఎస్ లక్ష్మణ్‌ను సంప్రదించి, రెడ్ బాల్ జట్టుకు కోచ్‌గా ఆసక్తి ఉందా అని అడిగినట్లు సమాచారం.
అయితే లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ‘హెడ్ ఆఫ్ క్రికెట్’గా తన పాత్రతో సంతృప్తిగా ఉన్నారని నివేదిక వెల్లడించింది. అంతేకాదు, బీసీసీఐ అంతర్గత వర్గాల్లో గంభీర్ టెస్టు జట్టుకు సరైన కోచ్ కాదనే అభిప్రాయం కూడా కొందరిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, గంభీర్‌కు బీసీసీఐలో బలమైన మద్దతు ఉందని నివేదిక పేర్కొంది. 2025–27 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ సైకిల్‌లో భారత్‌కు ఇంకా తొమ్మిది టెస్టులు మిగిలి ఉన్నాయి. శ్రీలంక, న్యూజిలాండ్‌లతో విదేశాల్లో రెండేసి టెస్టులు, స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. ఫైనల్‌కు చేరాలంటే భారత్ కనీసం 7 నుంచి 8 టెస్టులు గెలవాల్సిన పరిస్థితి ఉంది.
