కన్నడ స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.
ఈ మేరకు యశ్ తన సోషల్ మీడియా ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. “హానర్ థై ఫాదర్.. #Toxic 26-08-2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో” అని ఆయన పేర్కొన్నారు. దీనితో ఇప్పటివరకు నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.
నిజానికి ఈ సినిమా మొదట 2026 మార్చి 19న విడుదల కావాల్సింది. అయితే, అదే రోజున రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రం కూడా విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉంటుందని భావించారు. ఆ తర్వాత పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, చిత్రబృందం విడుదల తేదీని జూన్ 4కు వాయిదా వేసింది. ఆ సమయం కూడా దాటిపోవడంతో, ఇప్పుడు ఫైనల్‌గా ఆగస్టు 26వ తేదీని ఖరారు చేశారు.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యశ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అడ్వాణీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా మరియు రుక్మిణి వసంత్ వంటి అగ్ర తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యశ్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ డ్రామా కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
