వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో ఓ భర్తను భార్యే అత్యంత కిరాతకంగా హత్య చేయించింది. నమ్మించి మద్యం తాగించి రాళ్లతో తలపై మోది కడతేర్చారు. ఈ సంచలన ఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు కేవలం ఒక్క రోజులోనే దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.
ఆళ్లగడ్డ పట్టణంలోని నాయీబ్రాహ్మణ కాలనీలో ఆంజనేయులు (27) నివాసముంటున్నాడు. అతనికి రుద్రవరం మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన సుబ్బులుతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా సుబ్బులుకు చాగలమర్రి మండలం తోడేండ్లపల్లె గ్రామానికి చెందిన గురుప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ విషయం తెలుసుకున్న భర్త ఆంజనేయులు భార్యను తీవ్రంగా హెచ్చరించాడు. తన కాపురానికి అడ్డుగా వస్తున్న భర్తను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని సుబ్బులు నిశ్చయించుకుంది. తన ప్రియుడు గురుప్రసాద్‌తో కలిసి భర్త హత్యకు పక్కా ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం గురుప్రసాద్, అతని స్నేహితుడు షరీఫ్ ఆదివారం రాత్రి ఆంజనేయులు వద్దకు వెళ్లారు. మద్యం తాగుదామంటూ అతడిని నమ్మించి పట్టణ శివారులోని పాలసాగరం రోడ్డులోని మొక్కజొన్న పొలంలోకి తీసుకెళ్లారు.
అక్కడ ఆంజనేయులుకు విపరీతంగా మద్యం తాగించారు. ఆ తర్వాత అతని తలపై రాళ్లతో బలంగా మోది కిరాతకంగా హత్య చేశారు. సోమవారం ఉదయం ఈ హత్య వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. అయితే మృతుడి భార్య సుబ్బులు మాత్రం ఎలాంటి పాపం ఎరుగనట్లు నటించింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి దగ్గర నుంచి తన భర్తను పిలుచుకుపోయారని, తెల్లారేసరికి విగతజీవిగా పడి ఉన్నాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.
ఆమె ప్రవర్తనపై తీవ్ర అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో సుబ్బులు తన ప్రియుడితో కలిసి ఈ హత్య చేయించినట్లు అంగీకరించింది. దీంతో ప్రధాన నిందితురాలు సుబ్బులు, ఆమె ప్రియుడు గురుప్రసాద్‌తో పాటు హత్యకు సహకరించిన షరీఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న సీఐ నాగరాజారావు, ఎస్‌ఐ చిన్న పీరయ్యల బృందాన్ని డీఎస్పీ అభినందించారు.
