- Advertisement -

పార్టీ వీడే యోచనలో మంత్రి సురేఖ ఫ్యామిలీ?

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఆమెపై అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే హైకమాండ్ నిర్ణయం వెలువడే కంటే ముందే ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని కొండా దంపతులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడే దిశగా వారు యోచిస్తున్నట్లు సమాచారం.

మంత్రి పదవికి రాజీనామా చేయాలా, లేదంటే నేరుగా పార్టీని వీడాలా అనే దానిపై వారు మల్లగుల్లాలు పడుతున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తమ తదుపరి రాజకీయ అడుగుపై మీడియా ముఖంగా స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం పిలుపుతో దిల్లీ వెళ్లిన కొండా సురేఖ పెద్దలకు వివరణ ఇచ్చారు. ఆ తర్వాత రాత్రికి రాత్రే ఆమె హైదరాబాద్‌కు చేరుకున్నారు.

హైకమాండ్ నిర్ణయం వెల్లడించేందుకు సమయం పడుతుందని చెప్పడంతో ఆమె వరంగల్‌కు బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు తమ నివాసంలో అనుచరులతో కొండా దంపతులు సమావేశం కానున్నారు. ప్రస్తుత పరిణామాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ పార్టీ తనపై వేటేస్తే, ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లాలని ఆమె గతంలోనే భావించినట్లు సమాచారం. కూతురు సుస్మిత రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కూతురు సుస్మితా పటేల్ వ్యాఖ్యలతో ఈ వివాదం రాజుకుంది. పరకాలకు తానే కాబోయే ఎమ్మెల్యేనంటూ ఆమె చేసిన కామెంట్లు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. కూతురి వ్యాఖ్యలను ఖండించని సురేఖపై వేటు వేయాలని పార్టీలోని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇప్పటికే అధిష్టానానికి చేరింది. అయితే కొండా ఫ్యామిలీని దూరం చేసుకోవద్దని సీనియర్లు కొందరు చెబుతుండగా, కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కొండా దంపతుల ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామానికి దారితీస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -