బాల్య వివాహాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన అధికారులు చేసిన చిన్న తప్పిదం వల్ల పెళ్లి జరిగిపోయింది. బాల్యవివాహాన్ని ఆపడానికి వెళ్ళి, పెళ్ళి కూతురుకు బదులు ఆమె చెల్లిని తీసుకెళ్లారు అధికారులు.
దీంతో వారు వెళ్ళిన కాసేపటికే జరిగిపోయింది పెళ్లి. గద్వాల మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఈ వ్యవహారంలో ఐసీడీఎస్, పోలీస్ అధికారుల నిర్వాకం స్పష్టంగా బయటపడింది.
అధికారులు వస్తున్నారన్న సమాచారంతో మైనర్ అయిన పెళ్లి కూతురును అక్కడి నుండి తప్పించారు పెద్దలు. కనీసం పెళ్లి పత్రికలో పేరు, ఆధార్ కార్డులో ఫోటోను చూడకుండా అక్కడే ఉన్న పెళ్లి కూతురు చెల్లెలైన మైనర్ బాలికను తీసుకొని వెళ్లారు అధికారులు.
అధికారులు వెళ్లిన వెంటనే మైనర్ బాలికకు ఓ గుడిలో పెళ్లి చేశారు పెద్దలు. దీంతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
