పరీక్షా ఫలితాలు రాకముందే ఓ విద్యార్థిని ఆందోళనకు గురై తనువు చాలించింది. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో 16 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లాలో విషాదాన్ని నింపింది.
మెదక్ జిల్లా కొత్తపల్లి తండాకు చెందిన బానోత్ సాయిప్రియ (16) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో పదో తరగతి చదువుతోంది. ఈ ఏడాది జరిగిన టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఆమె హాజరైంది. అయితే, పరీక్షలు రాసినప్పటి నుండి ఫలితాల విషయంలో సాయిప్రియ తీవ్ర ఆందోళన చెందుతోంది. తాను పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేనేమోనని, ఫెయిల్ అవుతాననే భయం ఆమెను వెంటాడింది.
కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయం చూసి సాయిప్రియ గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసి కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
పరీక్షల ఫలితాలు జీవితాన్ని నిర్ణయించవని, విఫలమైనా మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించవచ్చని విద్యావేత్తలు, పోలీసులు సూచిస్తున్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురైనప్పుడు ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన చేయకుండా, తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు తమ బాధను చెప్పుకోవాలని కోరుతున్నారు.
గమనిక: ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు. మానసిక ఒత్తిడి లేదా ఇతర ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయం కోసం ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించగలరు.
