ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు మీదున్నారు. నేటి నుండి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టగా ఈ నెల 31 వరకు జిల్లాల పర్యటన ఉండనుంది. ఒక ఓ వైపు జిల్లాల పర్యటన చేపడుతూనే మరోవైపు నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రేపటి నుండి పోటీ చేసే వారి నుండి దరఖాస్తు స్వీకరించనున్నారు.
రేపటి నుంచి అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుండగా తొలి అప్లికేషన్‌ను రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్ తీసుకోనున్నారు. ఇక పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో వలసలు ఉండనున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో అసలు కాంగ్రెస్ ఉనికే లేకుండా పోయింది. 2014, 2019లో చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఖాతా తెరచి సత్తాచాటాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగా షర్మిలను రంగంలోకి దించగా తనదైన శైలీలో దూసుకుపోతున్నారు.
ఇక కాంగ్రెస్ దరఖాస్తుల ప్రక్రియ 5 రోజుల పాటు ఉండనుంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరో ముగ్గురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. ఇక కర్నూల్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా కాంగ్రెస్ దరఖాస్తుల ప్రక్రియకు ఏ మేరకు ఆదరణ లభిస్తుందో వేచిచూడాలి.
