ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో చంద్రబాబుకు వచ్చింది బెయిలే…రిలీఫ్ కాదు. ఇక వాస్తవానికి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో బాబు పేరు నమోదైన తర్వాత ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 17ఏ సెక్షన్ ద్వారా తన పేరు తొలగించాలని కోరగా హైకోర్టు కొట్టివేసింది. తర్వాత సుప్రీంను ఆశ్రయించారు చంద్రబాబు. దీనిపై సుప్రీంలో రిలీఫ్ వస్తే బాబు ఈ కేసుల నుండి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది.
ఇక బాబు పేరు ఆరు కేసుల్లో చేర్చగా ఒక్క స్కిల్ స్కాం కేసులో బెయిల్ దక్కింది. మిగితా కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడుతూనే వస్తోంది. ఒకవేళ అన్నింటిలో బెయిల్ దక్కినా చంద్రబాబు ఈ కేసుల నుండి బయటపడాలంటే సుప్రీంకోర్టులో 17ఏ సెక్షన్ వర్తింపుపై అనుకూల తీర్పురావాలి. ఆ తీర్పు అనుకూలంగా వస్తే చంద్రబాబు సేఫ్ అయినట్లే. ఎందుకంటే ఆయనపై పెట్టిన కేసులన్నీ చెల్లకుండా పోతాయి.
ఒక వేళ 17ఏపై తీర్పు వ్యతిరేకంగా వస్తే చంద్రబాబు మరోసారి అరెస్టయ్యే అవకాశం లేకపోలేదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్ని కేసుల్లో ఒకే సారి కాకుండా.. ఒక కేసు తర్వాత మరో కేసును తెర ముందుకు తెచ్చి బెయిల్ వచ్చే సమయంలో మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. సుప్రీంలో క్లీన్ చీట్ వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. మరి సుప్రీంలో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందా…?రాకుంటే టీడీపీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండనుందో వేచిచూడాల్సిందే.
